Tuesday, 3 November 2026

జూడాల సమ్మె చెల్లదు

123

48గంటల్లో విధుల్లో చేరండి

గడువు సమయం ముగిసేవరకూ చర్యలు తీసుకోవద్దు

ప్రభుత్వానికి హైకోర్టు సూచన

హైదరాబాద్‌, నవంబర్‌ 19 (జనంసాక్షి) : జూనియర్‌ వైద్యుల ఆందోళన చట్ట వ్యతిరేకమని, అది చెల్లదని హైకోర్టు స్పష్టంచేసింది. జూడాలు చేపట్టిన సమ్మెను 48 గంటల్లో విరమించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ 48 గంటల్లోపు జూనియర్‌ డాక్టర్లపై ఎటువంటి చట్టపరమైన చర్యలు చేపట్టవద్దని స్పష్టంచేసింది. జూడాల సమ్మెపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. జూనియర్‌ వైద్యుల ఆందోళన చట్ట వ్యతిరేకమని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు గౌరవ వేతనం తీసుకుంటూ సమ్మె ఎలా చేస్తారని కోర్టు ప్రశ్నించింది. ప్రజా సేవలో ఉన్న విద్యార్థి వైద్యులకు ఇది తగదని వ్యాఖ్యానించింది. 48 గంటల్లోగా సమ్మెను విరమించాలని ఆదేశించింది. మరోవైపు, జూడాల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిపై చట్టపరమైన చర్యలేవీ చేపట్టొద్దని ప్రభుత్వానికి సూచించింది. అదే సమయంలో జూడాలు సమ్మె విరమించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపింది. 48 గంటల్లోగా వారు సమ్మె విరమించేలా జూడాల న్యాయబద్దమైన డిమాండ్లను పరిశీలించాలని పేర్కొంది. అయితే, ఆ తర్వాత కూడా సమ్మె కొనసాగిస్తే.. నిబంధనల ప్రకారం వ్యవహరించవచ్చని స్పష్టం చేసింది. గ్రావిూణ సర్వీసు మినహా జూనియర్‌ వైద్యుల డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రావిూణ ఆస్పత్రుల్లో జూనియర్‌ వైద్యులు సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జీవో నెం.107ను జారీ చేసింది. దీనిపై ఆగ్రహించిన జూనియర్‌ డాక్టర్లు అక్టోబర్‌ 1 నుంచి సమ్మెకు దిగారు. గ్రావిూణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు తాము సిద్ధమని, కానీ శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరపాలని వారు డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 1 నుంచి నిరవధిక సమ్మె కొనసాగుతుండడంతో.. వైద్య సేవలందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. జూడాల సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడంతో పాటు వారిని విధుల్లో చేరేలా ఆదేశించాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీన్ని పలుమార్లు విచారించిన హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. జూడాల సమ్మె చట్ట విరుద్ధమని పేర్కొన్న ధర్మాసనం.. వారి న్యాయబద్దమైన డిమాండ్లను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *