కనీస వేతనాలు దరిచేరవు
పట్టించుకోని ప్రభుత్వాలు
పారిశుద్ధ్య కార్మికులపై మీడియాది చిన్నచూపే
‘స్వచ్ఛ్ భారత్’తో విఐపిలకు బోలెడంత ప్రచారం
ఫొటోలకే పరిమితమవుతున్న సెలబ్రిటీలు, ప్రముఖులు
పారిశుద్ధ్య కార్మికులపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం
హైదరాబాద్, నవంబర్ 19 (జనంసాక్షి) : ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో నిజమైన సెలబ్రిటీలు ఎవరు..? చేతులు, కాళ్లకు రక్షణ కవచాలు తొడుక్కుని.. పది నిమిషాలు.. పావుగంట.. అరగంటపాటు చీపురు, పలుగు, పార పట్టి ఫొటోలకు పోజులిచ్చేవారా..? టీవీ ఛానెళ్ల కెమెరాల ముందు ఊడ్చినట్లు నటించేవారా..? లేక నగరాలను పరిశుభ్రంగా ఉంచడం తమ విధి అని.. రాత్రనకా.. పగలనకా.. ఎండనకా.. వాననకా చీపురుపట్టి.. దుమ్ము, దూళి మింగుతూ.. రోడ్లు ఊడ్చి.. చేతులతో చెత్త ఎత్తే కార్మికులా..? అంటే.. శరీరానికి ఎలాంటి రక్షణ కవచాలు ధరించకుండా.. నిత్యం మురుగులో మునుగుతూ.. చెత్తలో తిరుగుతూ.. నగరాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులే ‘స్వచ్ఛ్ భారత్’కు నిజమైన సెలబ్రిటీలు అని సామాన్యులందరూ భావిస్తున్నారు. కానీ.. కాయకష్టం చేసుకుని బతికే నిజమైన సెలబ్రిటీలను ప్రభుత్వాలు, మీడియా ఎక్కడా గుర్తించడం లేదు. వారి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు..? ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది.
కనీస వేతనాలు దక్కవు…
నిత్యం మురుగు కంపులో కాలం వెళ్లదీస్తూ.. నగరాల పారిశుద్ధ్యం తమ విధిగా భావించి.. నిస్వార్థంగా నగరాల్లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఏళ్ల తరబడి పనిచేసినా వారికి ఉద్యోగ భద్రత ఉండదు. ముసలితనం వచ్చినా కాంట్రాక్టు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. ఈ క్రమంలో వారికి ఆరోగ్యం దెబ్బతింటే ఆరోగ్య బీమా సౌకర్యాలు కూడా వర్తించవు. ఈఎస్ఐ, పిఎఫ్ అంటే ఏమిటో వారికి తెలియదు. వారాంతపు సెలవుల మాట మర్చిపోవాల్సిందే. ఆఖరుకు కాంట్ట్రార్లు కన్నెర్రజేస్తే ఉద్యోగం ఊడాల్సిందే. ఇన్ని ఇబ్బందులు భరించుకుని విధులు నిర్వహించినా వారి జీతం రూ.6 వేలు దాటదు. దీంతో వారు తమ కుటుంబాన్ని పోషించుకోలేక.. పిల్లలను చదివించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. పైగా వారిచ్చే ఆ చాలీచాలని జీతాలు పెరిగిన ధరల కారణంగా ఏ మూలకూ సరిపోవడం లేదు. అంతేకాదు.. ఆ వచ్చే జీతాలు కూడా సమయానికి రావు. దాంతో కుటుంబ అవసరాల కోసం వారు ప్రవేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల దోపిడీకి నిండా అప్పుల్లో తేలుతూ.. నిరుపేదలుగా మారుతూ.. బిక్కుబిక్కుమంటూ.. అనారోగ్యంతో.. బతుకుబండిని లాగిస్తున్నారు.
‘స్వచ్ఛ్భారత్’తో సెలబ్రిటీలు, ప్రముఖులకు ప్రచారం..
స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు యావత్ భారత ప్రజలు సహకరించాలని, అందుకు తగిన ప్రచారం కల్పించి.. దీన్ని ఓ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని తరగతుల ప్రజలు పాల్గొనాలని సూచించారు. అంతే.. ఈ కార్యక్రమ ప్రచారానికి ప్రముఖ సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు, విఐపిల తాకిడి పెరిగింది. పెద్ద ఎత్తున స్వచ్ఛ్ భారత్లో పాల్గొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పలు సందేశాలు కూడా ఇస్తున్నారు. కానీ.. వారు నిజంగా స్వచ్ఛ్భారత్ నిర్వహిస్తున్నారా..? అంటే లేదనే చెబుతున్నాయి వారుచేసే కార్యక్రమాలు. స్వచ్ఛ్భారత్లో పాల్గొనే ముందు సెలబ్రిటీలు తమ చేతులు, కాళ్లు, మొత్తం శరీరానికి రక్షణ కవచాలు ధరించి చీపురు, పలుగు, పార పట్టుకుని నిలబడుతున్నారు తప్ప నిజానికి పారిశుద్ధ్య పనులు చేయడం లేదు. కెమెరాలు క్లిక్మనే వరకు ఫోజులిస్తున్నారు. పది నిమిషాలు, పావుగంట, అరగంటపాటు హడావుడి చేసి వెళ్లిపోతున్నారు. దీనికి కార్పొరేట్ మీడియా పొద్దంతా బులిటెన్ల మీద బులిటెన్లు వేసి ప్రసారం చేస్తున్నాయి. ప్రింట్మీడియాలో పెద్దపెద్ద ఫొటోలతో వార్తలొస్తున్నాయి. కానీ.. అదే పారిశుద్ధ్య కార్మికుల కష్టసుఖాలను వెలుగులోకి తీసుకురావు. వారిపట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిరాసక్తతను బయటికి తీయవు. దీన్నిబట్టి చూస్తే.. ‘స్వచ్ఛ్భారత్’ సెలబ్రిటీలకు, ప్రముఖులకు మంచి ప్రచారం ఇస్తోందని, అందుకు కార్పొరేట్ మీడియా కూడా సహకరిస్తోందని అర్థమవుతోంది.
పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ఆధరణ శూన్యం…
జీవితాన్ని పారిశుద్ధ్య పనులకు అంకితం చేసి విధులు నిర్వహిస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మికుల సంక్షేమ నిధి, ఆరోగ్యబీమా వంటి సౌకర్యాలను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతులేని నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రభుత్వం శ్రీకారం చుట్టిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో కీలకపాత్ర పారిశుద్ధ్య కార్మికులదే. అసలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేది కూడా వారే. అయినా వారికి కనీస వేతనాలు చెల్లించేందుకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు రావడం లేదు. వారితో పనులు చేయించుకోవడమే తప్ప వారి సంక్షేమానికి కృషి చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో పరిశుభ్రతకు నిజంగా పాటుపడేది ఎవరో గుర్తించాలని, తద్వారా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని జనంసాక్షి కోరుతోంది.





