జూన్‌ 14న చలో అసెంబ్లీ


మహా సంగ్రామానికి టీ జేఏసీ వ్యూహం
హైదరాబాద్‌ దిగ్బంధనం
దిశగా కార్యాచరణ

హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) :
చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జూన్‌ 14న నిర్వహించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరుకు టీఎన్‌జీవో భవన్‌లో బుధవారం జరిగిన జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌  కోదండరామ్‌ ధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోయేందుకు ఇప్పటి వరకు నిర్వహించిన ఆందోళనలు, ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలపై సమీక్ష జరిపామని, చివరకు చలో అసెంబ్లీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో పదే పదే మోసం చేస్తున్న కాంగ్రెస్‌పై, ఆ పార్టీకి అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీపై గట్టి ఒత్తిడి తెచ్చేందుకే చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నామని అన్నారు. లక్షల సంఖ్యలో ఈ కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోదండరామ్‌ పిలుపునిచ్చారు. జూన్‌ 1వ తేదీ నుండి చలో అసెంబ్లీ కోసం తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి  ప్రచారం నిర్వహిస్తామని, తెలంగాణ ఏర్పాటు విషయమై ప్రతి ఇంటి యజమానికి వివరిస్తామని కోదండరామ్‌ అన్నారు. సీమాంధ్ర పార్టీలకు చెందిన నేతల దిమ్మతిరిగేలా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని, దీని తడాఖా ఏమిటో చూపిస్తామని అన్నారు. తెలంగాణకు సాధించుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వచ్చే స్వతంత్రం తమకుందని, చలో అసెంబ్లీ నిర్వహించే రాజ్యాంగ హక్కు తమకుందని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు సూర్యంతో పాటు పలు పార్టీల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.