టిడిపి ఉక్కుదీక్షలను ప్రజలు నమ్మరు
వైకాపాను అడ్డుకునేందుకే డ్రామాలు:ఆకెపాటి
కడప,జూలై4(జనం సాక్షి ): వైసిపితోనే ఉక్కు పరిశ్రమ సాధ్యమవుతుందని వైసిపి రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షలు ఆకేపాటి అమరనాధరెడ్డి అన్నారు. టిడిపి దొంగదీక్షలతో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్నారు. నాలుగేళ్లు నిద్రపోయిన ప్రభుత్వం ఇప్పుడు విమర్శలు రావడంతో ఎన్నికల ముందు ప్రజల్లో షో చేసిందని మండిపడ్డారు. నాలుగేళ్లు బిజెపితో సంసారం చేసి, నేడు రాష్ట్రం కోసం, విభజ హావిూల కోసం బయటి వచ్చామని జిల్లాలో ఉక్కు పేరుతో దొంగదీక్షలు చేస్తుందన్నారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసం ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టితే ఈ రోజు దీక్షలు చేస్తున్న టిడిపి నేతలు అడ్డుకున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఎంఎల్‌సి బీటెక్ రవిలు ఏరోజు ఉక్కు పరిశ్రమ పైన పోరాడిన దాఖలాలు లేవన్నారు. ఆనాడు ఉక్కు పరిశ్రమను అడ్డుకున్నందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నారు.జిల్లాలోఉక్కుపరిశ్రమ ఏర్పాటు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.2 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తే అప్పుడు పరిశ్రమ నిర్మాణం జరగకుండా అడ్డుపడి ఇప్పుడు దొంగ దీక్షలు చేసినంత మాత్రాన ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మరని అన్నారు. సిఎం రమేష్, బీటెక్ రవిల దీక్ష ఈవెంట్ మేనేజ్మెంట్‌లా నిర్వహించారని అన్నారు. ఎన్నికల ముందు ఎన్ని కుప్పిగంతులు వేసినా వైకాపాను అడ్డుకోలేరని అన్నారు.