తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైతే యాగం చేద్దామని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబరు 23 నుంచి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా అయుత చండీ యాగాన్ని నిర్వహించారు. దేశంలోని ఏడు రాష్ట్రాలకు చెందిన దాదాపు 1500 మంది రుత్వికులు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. లక్షలాది మంది యాగాన్ని కనులారా తిలకించేందుకు ఎర్రవల్లికి బారులు తీరారు. ఏడాది తర్వాత అదే తేదీన (డిసెంబరు 23) మరోసారి ఎర్రవల్లి ఓ
కార్యక్రమానికి వేదిక అవుతోంది. వూరువూరంతా ఆనందోత్సాహల మధ్య ఈనెల 23న రెండు పడక గదుల ఇళ్లలో గృహప్రవేశాలు చేసుకోనున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ఇళ్ల నిర్మాణానికి గతేడాది అక్టోబరు 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పక్కా ఇళ్లులేని వారిని గుర్తించి ఈ రెండు గ్రామాల్లో కలిపి 530 ఇళ్ల నిర్మాణాలను దాదాపుగా పూర్తిచేశారు. ప్రతిఒక్కరూ తమ ఇంట్లో గృహప్రవేశ పూజాకార్యక్రమాలను నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రతువు నిర్వహించేందుకు గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక తదితర ప్రాంతాల్లో ఉన్న 500 మంది పురోహితులను ఎంపిక చేస్తున్నారు. డిసెంబరు 23న వీరంతా వచ్చి ఒక్కో ఇంటిలో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేయించనున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని కల్యాణమండపం వద్ద జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
డిసెంబరు 23న మహత్తర కార్యం




