కర్నూలు,ఫిబ్రవరి14(జనంసాక్షి): జిల్లాలోని అక్రమాలకు పాల్పడే డీఎడ్ కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపల్ వై.రాఘవరెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. విద్యార్థుల నుంచి ప్రవేశాలు, భవనాలు, దస్త్రాల పేరుతో అధిక రుసుములు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అక్రమ చెల్లింపులు చేసిన విద్యార్థులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. జిల్లాలోని అన్ని డీఎడ్ కళాశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ సక్రమంగా సాగేలా బాధ్యులైన ప్రతి ఒక్కరు సహకరించాలని రాఘవరెడ్డి విజ్ఞప్తిచేశారు. విద్యార్థులు కూడా దస్త్రాలను బయట ఖరీదు చేసుకోని సమర్పించాల్సి ఉంటుందన్నారు. కళాశాల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, అధ్యాపకుల హాజరును సెల్ ఫోన్ ద్వారా ప్రతి రోజు వీడియో తీసి వాట్సప్ ద్వారా పంపాలని ఆయన తెలిపారు. పైన పేర్కొన్న విధంగా పంపని కళాశాలలను పక్షానికి ఒక రోజున తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు.




