న్యూదిల్లీ డిసెంబర్22 (జనంసాక్షి) :: దేశ రాజధాని దిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో దిల్లీలో జనజీవనం స్తంభించింది. పలు రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 173 విమానాలా రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొగమంచు ప్రభావం పార్లమెంటు సమావేశాలపైనా పడింది. ఉదయం నుంచీ పార్లమెంటు పరిసరాల్లోనూ పొగమంచు దట్టంగా అలుముకుంది. కేంద్రమంత్రులు, సభ్యులు శాలువాలు కప్పుకుని పార్లమెంటుకు రావడం కనిపించింది.
మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు, మంచు భాగ్యనగరాన్ని ముసురుకుంటున్నాయి. గత మూడు రోజులుగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. చలిసిటీజనులను గజ గజలాడిస్తోంది. సోమవారం కనిష్టంగా 11.2 డిగ్రీలు, గరిష్టంగా 27.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 41 శాతానికి పడిపోయింది. చలికితోడు ఉదయం వేళ కురుస్తున్న మంచు కారణంగా ఆస్తమారోగులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో ఉన్నా చలి వణికిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గడంతో పాటు, శీతల గాలుల ఉద్ధృతి పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతుండడంతో నగరం వైపు వీస్తున్న శీతల గాలులు ఉద్ధృతి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఈ పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరై, చలిలో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.





