– మహారాష్ట్ర సీఎం అంగీకారం
– ఇరిగేషన్ ఉన్నతాధికారుతో ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్: వీలైనంత తక్కువ ముంపుతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులను నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తాను ఫోన్‌లో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టుల స్థితిగతులను వివరించానని అందుకు మహారాష్ట్ర ముఖ్యంత్రి సానుకూలంగా స్పందిచాడని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ఆదివారం తెలంగాణ నీటిపారుదలశాఖపై ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సవిూక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గోదావరి నదిపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల అంశంపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలో మహారాష్ట్ర అధికారులతో హరీశ్‌రావు బృందం భేటీ అవుతుందని వెల్లడించారు. గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల పనులను జనవరిలో ప్రారంభింని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల రీడిజైనింగ్ కొలిక్కి వచ్చినందున కార్యరంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. నెలాఖరులోగా బ్యారేజి, కాలువ పనులపై నివేదికలు పూర్తికావాలని ఆదేశించారు.తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు తలపెట్టిన ప్రాజెక్టుల రీడిజైన్ పని ఓ కొలిక్కి వచ్చినందున కార్యరంగంలోకి దిగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల ద్వారా బీడు భూములకు నీరు అందుతుందనే ఆశతో ఉన్న రైతులకు వారి ఆకాంక్షలకు తగ్గట్టు వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఏకకాలంలో ప్రారంభమై పనులు వేగంగా పూర్తి కావాలని ఆదేశించారు. ప్రాజెక్టులపై సీఎంల స్థాయి ఒప్పందానికి కేసీఆర్ ప్రతిపాదన చేశారు. తుమ్మిడిహట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులతో మహారాష్ట్రలో ముంపు ఉండదని కేసీఆర్ తెలిపారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన బ్యారేజీలు, రిజర్వాయర్ల కాల్వలు,పైప్ లైన్లకు సంబంధించిన నివేదికలు పూర్తి కావాలని ఆదేశించారు. కనిష్ట ముంపు, గరిష్ట నీటి వినియోగం అనే పద్దతిలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం వల్ల అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ సమస్యలు ఎక్కువగా ఉండవని అధికారులకు సూచించారు. తమ్మిడిహట్టి దగ్గర 148 విూటర్ల ఎత్తులోనే బ్యారేజీని నిర్మించాలని సీఎం అధికారులకు సూచించారు. అంతకు ముందు కేసీఆర్
మహారాష్ట్ర ముఖ్యంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఫోన్ చేసి తెలంగాణ ప్రాజెక్టుల విషయమై మాట్లాడారు. తమ్మిడిహట్టి వద్ద, కాళేశ్వరం వద్ద నిర్మించే బ్యారేజిలు, ప్రాజెక్టుల రీ డిజైన్ గురించి వివరించారు. గతంలో మాదిరిగా తమ్మిడి హట్టి వద్ద బ్యారేజి నిర్మించడం వల్ల మహారాష్ట్రలో ముంపు ఉండదని సిఎం స్పష్టం చేశారు. దాంతో పాటు గడ్చిరౌలి జిల్లా సరిహద్దులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, దీని వల్ల కూడా మహారాష్ట్రలో ముంపు ఉండదని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం త్వరలోనే మహారాష్ట్రలో పర్యటించి అక్కడి మంత్రి, అధికారులతో సమావేశమవుతారని తెలిపారు. ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారని, ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. దీనికి ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. గోదావరి నదిలో 160 టిఎంసి నీటిని తెలంగాణ వాడుకునేందుకు గతంలో సిఎం మహారాష్ట్ర కు వెళ్లినప్పుడే అంగీకరించిన ఫడ్నవీస్ తాజా ప్రతిపాదనల పట్ల కూడా సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణ బృందాన్ని తమ వద్దకు పంపాలని, తాము కూడా తమ నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులను సిద్ధం చేస్తామన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల సంభాషణ తర్వాత ప్రాజెక్టుల పూర్తి స్థాయి నివేదికలను తీసుకుని హరీష్ రావు నాయకత్వంలోని బృందం త్వరలోనే మహారాష్ట్రకు వెళ్లాలని నిర్ణయం జరిగింది ఇక త్వరలో మంత్రి హరీష్‌రావు బృందం మహారాష్ట్రలో పర్యటించనుంది. ప్రాజెక్టుల పూర్తిస్థాయి వివరాలను హరీష్‌రావు మహారాష్ట్ర అధికారులకు అందించనున్నారు.
మిషన్ కాకతీయ ఫేజ్-2లో వెయ్యి చెరువులు చేపట్టాలి: హరీష్‌రావు
మిషన్ కాకతీయ ఫేజ్-2లో భాగంగా వెయ్యి చెరువులను పునరుద్దరణ కోసం చేపట్టాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా నీటిపారుదల పనులపై సవిూక్ష చేపట్టారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు పలువురు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మిషన్ కాకతీయ ఫేజ్-1 పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో 851 చెరువులకు గాను రూ.240 కోట్లు కేటాయించామన్నారు. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువపై 17లిఫ్ట్ ఇరిగేషన్ల ఆధునీకరణకు రూ.55 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 57 లిఫ్ట్ స్కీమ్‌ల మరమ్మతులకు ట్రైబల్ సబ్‌ప్లాన్ కింద వెంటనే టెండర్లు పిలవాలని కోరారు. పులిచింతల ప్రాజెక్టులో ముంపునకు గురవుతోన్న లిఫ్ట్ పథకాలను ఏపీ అధికారులతో కలిసి సర్వే నిర్వహించి తరలించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పాలెం వాగు స్పిల్ వే గేట్ల నిర్మాణం మార్చి చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కల్లా పాలెం వాగు కాలువ కింద10,200 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి మదిరపూరం వరకు ఎత్తిపోతల పథకం టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. టెండర్ బిడ్ డాక్యుమెంట్‌కు వెంటనే ఆమోదం తెలపాలని పేర్కొన్నారు.





