Tuesday, 3 November 2026

తాడిపత్రిలో మరోమారు ఉద్రిక్తత

స్వామి శిష్యుడిని రక్షిస్తున్నారంటూ బైఠాయింపు

అనంతపురం,నవంబర్‌1(జ‌నంసాక్షి): తాడిపత్రిలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువతి కిడ్నాప్‌కు యత్నించిన స్వామి ప్రబోధానంద శిష్యుడిని రక్షిస్తున్నారంటూ పోలీస్‌ స్టేషన్‌ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. స్వామి ప్రబోధానంద శిష్యుడు నాగరాజు.. గ్రామంలోని ఓ ఇంటిముందు ముగ్గు వేస్తున్న యువతి కళ్లల్లో కారం కొట్టి కిడ్నాప్‌కు యత్నించాడు. ఆమె అరుపులతో బయటకు వచ్చిన తల్లిదండ్రులు.. నాగరాజుపై దాడికి దిగారు. దీంతో సీన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు చేరింది. తనపై దాడి చేశారంటూ యువతి తల్లిదండ్రులపై నాగరాజు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. దీంతో నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి. స్వామి ప్రబోధానందను అరెస్ట్‌ చేయాలంటూ స్టేషన్‌ ముందు బైఠాయించారు టీడీపీ కార్యకర్తలు. ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడంతో రెండు గంటల పాటు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.