Tuesday, 3 November 2026

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల,ఫిబ్రవరి8( (జనం సాక్షి)): తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కొవిడ్‌ దృష్ట్యా ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వేడుకలు.. చందప్రభ వాహనంతో ముగియనున్నాయి. కొవిడ్‌ దృష్ట్యా రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు భక్తులకు దర్శనమిచ్చారు. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమలలో ’రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ శాస్తోక్తర్రగా నిర్వహించింది. కరోనా నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహించారు. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చందప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.
రథసప్తమి వాహనసేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభవాహనం. ఈ ఏడాది శ్రీవారి ఆలయంలోని ధ్వజ మండపం ముందు శ్రీమలయప్పస్వామివారిని సూర్యప్రభవాహనంపై వేంచేపు చేశారు. సర్వలోకాల కు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.43 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందు తున్నాడు. ఈ వాహనంలో శ్రీవారిచుట్టూ ఉన్న సూర్యప్రభ సకలజీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
““““““