తెలంగాణకు జైపాల్ వారధి
కావూరి ప్రకటనతో జోరు
తెలంగాణ సీనియర్లంతా సభలో పాల్గొనాలని నిర్ణయం
నేడు నిజాం కాలేజీలో టీ కాంగ్రెస్ సభ
హైదరాబాద్, జూన్ 29 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి మంత్రి జైపాల్‌రెడ్డి వారధి కానున్నట్టు సమాచారం. తెలంగాణకు అనుకూలంగా పరిస్థితులను మార్చేందుకు జైపాల్ కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి పాత్ర కీలకంగా మారినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన దిగ్విజయ్ సింగ్ ఇటీవల స్వయంగా జైపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ సమస్య పరిష్కారానికి అతని సలహా, అభిప్రాయం కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన ముఖ్య విషయాలన్నీ చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. చాలా కాలం నుంచీ మౌనంగా ఉంటూ, తెరవెనుక రాజకీయానికి పరిమితమైన జైపాల్.. భవిష్యత్తులో తెలంగాణ ఏర్పాటులో తన పాత్ర కీలకంగా ఉంటుందన్న సంకేతాలిచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జైపాల్‌రెడ్డి లోలోపల మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తన వాదనను అధిష్టానం వద్ద గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కూడా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పినట్టు సమాచారం. ఇటీవల ప్రధాని మన్మోహన్సింగ్ వద్ద కూడా కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన ప్రధానికి కచ్చితంగా చెప్పినట్టు పీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సమస్య పరిష్కారమేమిటో తన కచ్చితమైన అభిప్రాయాలను ఆయన ప్రధానికి వివరించనట్టు జైపాల్ కూడా స్వయంగా వెల్లడిరచారు. తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్‌లో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై తన భావనలను, అంచనాలను ప్రధానికి వివరించానని చెప్పారు. ప్రధానిని కలిసి దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడినట్టు ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందో తాను చెప్పానని, అయితే ప్రధానికి తాను చెప్పిన విషయాలను మాత్రం బయటకు వెల్లడిరచలేనని ఆయన అన్నారు. కేంద్రమంత్రిగా, పార్టీ సీనియర్ నేతగా సమస్య పరిష్కారానికి తాను చేయాల్సిందంతా చేస్తానని ఆయన అన్నారు. సమస్యను సత్వరం పరిష్కరించాలని, జాప్యం చేయడం సరికాదని తాను చెప్పినట్టు ఆయన వివరించారు. తెలంగాణ సమస్యను కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే పార్టీకి ప్రయోజనం చేకూరే తీరును కూడా ఆయన వివరించనట్టు చెబుతున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఆయన అధిష్టానం పెద్దలతో నిరంతరం మాట్లాడుతున్నట్టు సమాచారం. కాగా అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యోచన నుంచి వెనక్కి తగ్గకుండా చూడాలంటే ఈ నెల 30న హైదరాబాద్‌లో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని జైపాల్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస ్నేతలకు చెబుతున్నట్టు సమాచారం. జైపాల్‌రెడ్డి చొరవ కారణంగానే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులంతా ఒక తాటిపైకి వచ్చి సభను విజయవంతం చేయడానికి పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో సీనియర్ మంత్రి కుందూరు జానారెడ్డి చురుకుగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు నాయకత్వం వహిస్తున్న జానా.. కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ వస్తుందన్న సంకేతాలిచ్చేందుకు ఆదివారం నిజాం కళాశాలలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు లక్ష మందిని సమీకరించాలన్నది వారి లక్ష్యంగా తెలుస్తోంది. ఈ సభ తరువాత ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ అధిపత్యానికి గండికొట్టే వ్యూహానికి జానారెడ్డి పదునుపెడుతున్నట్టు సమాచారం. ఈ సభ ద్వారా టీఆర్ఎస్పై యుద్ధభేరికి శ్రీకారం చుడుతున్నట్టు టీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ హైదరాబాద్‌లో కంటే హస్తినలో ఎక్కువ హడావుడి చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ మూడు, నాలుగు సార్లు సోనియాను కలిసి నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అసలు ఢల్లీిలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అంతుపట్టడంలేదు. తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించే క్రమంలో కాంగ్రెస్ నాయకత్వం తన మంత్రాంగాన్ని మాత్రం ముమ్మరం చేసిందనే చెప్పాలి.