Tuesday, 3 November 2026

తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోసం టిఆర్‌ఎస్‌ డిమాండ్

an8n8p3jహైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోది ఆ రాష్ట్రానికి లక్షా 25 వేల కోట్ల ప్రత్యేక ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో రాజకీయ పార్టీలు ఆందోళన మొదలు పెట్టాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పెద్దలను కూడా కలుసుకున్నారు. దీంతో మేల్కొన్న తెలంగాణ అధికార పార్టీ ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏనాడూ ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్‌ చేయని గులాబీ శ్రేణులు ఇపుడు వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాయి.బీహార్‌ మాదిరే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ విధానాన్ని అమలు చేసే అవకాశాలున్నాయని టిఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రంపై వత్తిడి తెస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పార్టీ నేతల్లో కనిపిస్తోంది.ఇప్పటివరకు విభజన చట్టంలోని అంశాలపై మాత్రమే కేంద్రంతో సంప్రదింపులు జరిపిన గులాబీ నేతలు త్వరలో ప్రత్యేక ప్యాకేజీపై ద్విముఖ వ్యూహంతో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని రాజకీయపార్టీలు తమతో కలిసి రావాలని విపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాన్ని టిఆర్ఎస్‌ రచిస్తోంది. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు.కేంద్రం తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఇవ్వకపోయినా అది తమకు అనుకూలం మార్చుకునేందుకు అధికార పార్టీ స్కెచ్‌ వేసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ప్యాకేజీ ఇస్తే ఆ ఘనత తమకే దక్కుతుంది. కేంద్రం స్పందించకుంటే తాము పోరాడినా కేంద్రం పట్టించుకోలేదనే సంకేతాలను జనం దృష్టికి తీసుకెళ్లేదుకు మార్గం సుగమమం అవుతుందన్న వ్యూహంతో టిఆర్‌ఎస్‌ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *