తెలంగాణపై ఆంధ్ర బ్రాండ్‌ బాజా

C

పూచిక పుల్లైన పర్వాలేదు.. మనోడే కావాలి

వారు రీల్‌ హీరోలు.. మనోళ్లు రియల్‌ హీరోలు

త్యాగాల పునాదులపై తెలంగాణ సాధించాం

ఆంధ్ర విషకౌగిలిలో మనం చిక్కోద్దు

మహేష్‌ బాబు బ్రాండ్‌పై భగ్గుమంటున్న తెలంగాణ

పోకిరి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఊహాగానాలపై ”జనంసాక్షి” ప్రత్యేక కథనం

ఎన్నో ఏండ్ల తండ్లట.. అలుపెరెగని పోరాటం.. ఆరవైయెండ్లగోస.. ఎందరోవీరుల త్యాగ ఫలం… తెలంగాణ స్వరాష్ట్ర కల సకారం మట్టి మనుషుల పోరాటం.. మనభాష యాస ఎక్కిరించినోళ్లు.. మనపోరాటాన్ని అవహేళన చేసినోళ్లు.. గాళ్లే బంగారు తెలంగాణ  కోసం ఉరికి వస్తుడ్రు.. ఇండ్ల నిజమెంతో తెలియదుగాని ఓ ముచ్చట మాత్రం గుప్పుమంది.. తెలంగాణోళ్లకంత మనస్సులో బాధైతున్నది. గాఆంధ్రా పోకిరి మహేష్‌బాబు మనకు బ్రాండ్‌ అంబాసిటర్‌ అని బజా భజంత్రి మోగిస్తున్రు గీ ముచ్చట ఎందుకో మనసున పడతలేదు.

ఎన్నో త్యాగాలు, ఎందరో అమరులు, ఇంకెన్నో పోరాటాల ఫలితం స్వరాష్ట్రంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక మంచు లక్ష్మి లాంటి వాళ్లు బతుకమ్మ ఆడినా…రాష్ట్రం ఏర్పడక ముందు సినీప్రముఖులెంతోమంది ఉద్యమకారులను కించపరిచినవాళ్లే.  తెలంగాణ వద్దు అని ఉపవాస దీక్షలు చేసినోళ్లు,     ఉద్యమ సమయంలో ఎంతోమంది సినీప్రముఖులు విభజనను వ్యతిరేకించిన సందర్భాలున్నాయి. తుఫాను వస్తే మేముసైతం అంటూ ఆడిపాడి ఆంధ్రులను ఆదుకుంటానికి ముందుకొచ్చిన సినిమావాళ్లు… తెలంగాణ బిడ్డలైన ఎందరో అమరులు ప్రాణత్యాగం చేస్తే ఏనాడూ స్పందించని కర్కష హృదయ పక్షపాతులు. అందుకే ‘గట్లాటి సినిమా వోళ్లనా ఇన్నాళ్లూ మనం అభిమానించింది’ అని అదే ఆంధ్ర సినీప్రముఖులను ఈసడించుకున్న ఉద్యమం తెలంగాణ ఉద్యమం.     మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినోళ్లు మన నుడికారాన్ని ఎక్కిరించినోళ్ళు అల్లదే   భాష అయినట్టు  గాళ్ల బాష హిరోకి మన భాష విలన్లకు పెట్టిన్రు.  గందుకే అటువంటి సినీపరిశ్రమలో తెలంగాణ వాటా కోసం పట్టుబట్టిన గతం మనది, సినీ పరిశ్రమలో ఆంధ్రుల పెత్తనాన్ని ప్రశ్నించిన గతం మనది, తెలంగాణ బిడ్డలకు సినిమాల్లో సమాన అవకాశాలను ఇవ్వాలని డిమాండ్‌ చేసిన గతం మనది. సినీపరిశ్రమలో వేళ్లూనుకుపోయిన ఆంధ్ర పెత్తనంపై ఎదురుతిరిగిన గతం మనది. ఇదీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలుగు సినీపరిశ్రమను తెలంగాణబిడ్డలు నిలదీసిన వైనం.

అయితే ఇప్పుడు రాష్ట్రం సిద్ధించింది. తెలుగు సినీపరిశ్రమను అబివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్ననంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాచకొండ గుట్టలల్ల 2000 ఎకరాలల్ల భారీ ఫిలింసిటీ నిర్మిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ”కేసీఆర్‌ సినిమా సిటీ” అని నామకరణం చేయాలని ఓ సందర్భంలో సినీనటుడు కృష్ణ అన్నరు. కేసీఆర్‌ కూడా మరో సందర్భంలో కృష్ణను పొగిడారు. ఇలా ఒకరినొకరు పొగుడుకున్న నేపథ్యమో మరే కారణమో తెలవదు కానీ… హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటాలని ఉవ్వీళ్లూరుతున్న ముఖ్యమంత్రి హైదరాబాద్‌ గురించి ప్రచారం చేయటానికి ఇప్పుడు ఓ బ్రాండ్‌ ఎంబాజిడర్‌ అవసరమైందని భావిస్తున్నరట. అందుకు సినీనటుడు మహేష్‌బాబును హైదరాబాద్‌ బ్రాండ్‌ ఎంబాజిడర్‌గా నియమించాలనుకుంఠున్నరని పుకార్లు షికారు చేస్తున్నయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే జంటనగరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన మొదలు, ఆకాశ హర్మ్యాల నిర్మాణం, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం స్కైవేస్‌, రింగ్‌ రోడ్లు , వినూత్న పారిశ్రామిక విధానం అంటూ తదితర ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. అభివృద్ధికి కంకణం కట్టుకోవడం అంతా స్వాగతిస్తున్నరు అయితే హైదరాబాద్‌ గురించి ప్రచారం చేయటానికి ఇప్పుడు ఓ బ్రాండ్‌ ఎంబాజిడర్‌ అవసరమైందని భావిస్తున్న ముఖ్యమంత్రి ఆలోచన సంతోషించదగిన విషయమే అయినా.. ఇందుకోసం మహేష్‌బాబును ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి ఆనుకుంటున్నడని చెవినపడితెనే సగటు తెలంగాణవాదికి మనసున పడతలేదు.  అరె.. మనం ఉద్యమం జేసింది గిందుకేనా.. వందలాది మంది ప్రాణాలు బలిపెట్టింది ఆంధ్రోన్ని అందలమెక్కిస్తానికా అని మండిపడుతున్నరు. హైదరాబాద్‌ను అమెరికాలోని డాలస్‌ నగరంలా తీర్చిదిద్దుతామని అంటున్న ముఖ్యమంత్రి గిట్ల అనుడు ఎందని   ఆవేదన చెందుతున్నరు. హైదరాబాద్‌లో జరగబోయే ఎన్నికల్లో టీయారెస్‌ గెలవాలంటే ఆంధ్ర సెటిలర్స్‌ ఓట్లు కావాలని కొందరు అంటున్నారు. తెలంగాణ నడిబోడ్డు నిజామాబాద్‌లోనే వాళ్లు తెలంగాణ వాళ్లకు ఓటు వెయ్యలేదు. ఖమ్మం ఓల్లదైతే అసలు ముచ్చటే లేదు వాళ్లు ఆంధ్రోళ్లు అన్నట్లే చేశారు.ఆంధ్ర సెట్‌లర్లు ఎక్కడ వున్న వాళ్ల ఆత్మ ఆంధ్రాదే.