హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. సర్కారీ దవాఖానాల్లో సౌకర్యాలు లేకపోవడంతో..ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థోమత లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో మృత్యు ఘంటికలు మ్రోగుతున్నా అధికారులు పట్టించుకోకపోవంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..
భద్రాచలం, వెంకటాపురం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు మండలాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒక్కరైనా రోగాల బారిన పడి మంచమెక్కుతున్నారు. వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన రోగులకు..సరైన వైద్యం అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సర్కారీ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేకపోవడంతో…అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నెలరోజుల్లో విషజ్వరాలతో 8 మంది మృత్యువాత పడ్డారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నామమాత్రమే అంటూ కొట్టిపారేస్తున్న వైద్యులు..
ఇక నిజామాబాద్ జిల్లాలోనూ డెంగ్యూ మహమ్మారి కోరలు చాస్తోంది. విషజ్వరాల అదుపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన వైద్యాధికారులు.. డెంగ్యూ కేసులు నామమాత్రమే అంటూ తేలికగా కొట్టిపారేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
గ్రామాల్లో విలయతాండవం చేస్తున్న డెంగ్యూ.
.నిజామాబాద్, డిచ్పల్లి, సిరికొండ, సదాశివనగర్, కామారెడ్డి, దోమకొండ, బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్, బీర్కూర్ తదితర గ్రామాల్లో డెంగ్యూ విలయ తాండవం చేస్తోంది. మేలో 10 మందికి… జులైలో 30 మందికి డెంగ్యూ సోకినట్లు వైద్యులు గుర్తించారు. జిల్లా కేంద్రాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణంపై భయంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది.
ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం..
ఇక ఏజెన్సీ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా కూడా విష జ్వరాలతో వణికిపోతుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వైరల్ ఫీవర్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉంది. పారిశుద్ధ్యం కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు..ఆ దిశగా ప్రయత్నించడం లేదంటున్నారు. కేవలం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు..
సందంట్లో సడేమియా అన్న చందంగా..ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చిందే తడవుగా అవసరం లేని టెస్టులన్నీ పేదల జేబుకు చిల్లుపెడుతున్నాయి. డెంగీ టెస్టులో నెగిటివ్ వచ్చినా రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ పడిపోయాయని భయపెడుతూ డబ్బులు దండుకుంటున్నాయి. 2015 జనవరి నుంచి జూన్ వరకు 75 కేసులు రాగా..అందులో 8 డెంగీ పాజిటివ్ కేసులుగా గుర్తించామని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. అనేకమంది విష జ్వరాలను గుర్తించలేక మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు మొద్దు నిద్ర వీడి.. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు




