సభలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల వాగ్వాదం
హైదరాబాద్, మార్చి 10 : తెలంగాణ అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శనివారంనాడు అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వీడియో ఫుటేజ్‌ను చూపించాల్చిందే అని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేశాయి. దీనిపై ప్రభుత్వం దాటివేత ధోరణిని అవలంభించడం సరికాదని కాంగ్రెస్, బీజేపీ మండిపడ్డాయి. ఇదే అంశంపై టి.అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది.
చివరకు జాతీయగీతాలాపన సందర్భంగా జరిగిన గందరగోళంపై వీడియో ఫుటేజీ చూసేందుకు స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయించారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యులకు వీడియో ఫుటేజీని స్పీకర్ చూపించనున్నారు.
మరోవైపు వీడియో ఫుటేజీ కోసం పట్టుబట్టిన కాంగ్రెస్ సభ్యులను మంత్రి జగదీష్‌రెడ్డి నీ యవ్వ అంటూ సంభోదించారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే అసెంబ్లీలో తన ప్రసంగానికి అడ్డుతగిలిన టీఆర్‌ఎస్ సభ్యులపై కాంగ్రెస్ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావును ఉద్దేశించి నోరు మూసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. మహిళలను అవమానించారంటూ మండిపడ్డారు.
దీనిపై మంత్రి కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. తోటి సభ్యులను గౌరవించడం డీకే అరుణ నేర్చుకోవాలన్నారు. కొన్ని సమీకరణాల వల్లే కేబినెట్‌లో మహిళలకు చోటు దక్కలేదని వివరించారు. తమలాగా మహిళా అధికారులను జైళ్లకు పంపలేదని, మహిళా మంత్రులను సీబీఐ కేసుల్లో ఇరికించలేదన్నారు. మహబూబ్‌నగర్ బంగ్లా దాదాగిరిలు ఇక్కడ చెల్లవని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.




