– ఆయన అడుగుజాడల్లో తెలంగాణ
– కొత్త వర్సిటీకి ఆయన పేరు
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,డిసెంబర్12(జనంసాక్షి): తెలంగాణ ఉన్నత శిఖరం రంగారెడ్డి అని, తెలంగాణ అభ్యుదయం కోసం కొండా వెంకట రంగారెడ్డి చూపిన బాటలో నడుస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆయన ఆశయాలకు పునరంకితమవుతామని ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి 125వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కాలేజీలో జరిగాయి. ఈ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒక యూనివర్సిటీకి లేదా ఏదైనా పెద్ద విద్యాసంస్థకు కేవీ రంగారెడ్డి పేరు పెడతామని, ప్రభుత్వ ఖర్చుతోనే హైదరాబాద్ లోని ప్రధాన కూడలిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. తెలంగాణ కోసం ఎంతో తపన పడ్డ ఉన్నత శిఖరం కొండా వెంకటరంగారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి అన్నారు. ఏపీలో కలిపితే తెలంగాణ ఎంత నష్టపోతదో, కలపకుంటే ఎంత బాగుపడతదో కొండా వెంకటరంగారెడ్డి ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. విద్యాసంస్థలు స్థాపించి సమాజానికి ఎంతో సేవ చేశారని చెప్పారు. దేశంలోనే 12 శాతం అభివృద్ధి రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇదే పద్ధతిలో పోతే 2019 నాటికి లక్షా 60 వేల కోట్ల వార్షిక బడ్జెట్ ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని వివరించారు. రెండేళ్లలో అభివృద్ధిలో సంపూర్ణ పరిపక్వత సాధించబోతున్నామన్నారు. పేదల సంక్షేమం కోసం రంగారెడ్డి ఎంతో తపించేవారని, సంక్షేమంలో కూడా తెలంగాణ రాష్ట్రం ముందుందని సీఎం కేసీఆర్ వివరించారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించనంతగా సంక్షేమం కోసం ఏడాదికి రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేవని, ప్రస్తుతం కరెంట్ కష్టాలు పోయాయని తెలిపారు. 2018 నాటికి 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించబోతోందని చెప్పారు. ఇందుకోసం 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రపంచమే అబ్బురపడేలా అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే 20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. రెండున్నరేళ్లలో ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు ఇస్తామన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టుల రీడిజైనింగ్ విధానాన్ని ప్రకటిస్తామన్నారు. వందకు వంద శాతం అనుకున్న ఫలితాలు సాధిస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒక్క తప్పటడుగు పడ్డా రాబోయే తరాలు నష్టపోతాయని ఆయన అన్నారు. కెవి రంగారెడ్డి దూరదృష్టి గల నేత అన్ని కేసీఆర్ కొనియాడారు. ఆనాడు ఏపీలో కలిస్తే తెలంగాణ ఎంత నష్టపోతుందో చెప్పిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఏపీలో కలిస్తే ఎంత నష్టపోతమని ఎలా చెప్పారో కలవకపోతే ఎంత లాభపడతామో కూడా చెప్పారని వివరించారు. తెలంగాణ కోసం ఎంతో తపన పడ్డ ఉన్నత శిఖరం కేవీ రంగారెడ్డి అని శ్లాఘించారు. ఆయన పేరును రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీకి, లేదా ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూషన్కు పెడతామని తెలిపారు. ప్రభుత్వం ఖర్చుతో నగరంలోని ప్రధాన కూడలిలో ప్రజలు ఎప్పుడూ చూసేలా రంగారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.





