తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయటంలో జాప్యానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిబంధనకు కట్టుబడి ఉన్నామని హై కోర్టుకు కేంద్ర న్యాయశాఖ వివరణ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై వైఖరి తెలపాలని తాము గతేడాది అక్టోబర్ 9వ తేదీనే వివరణ కోరామని తెలిపింది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు, హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ ప్రధాన న్యాయమూర్తి నుంచి ఇప్పటివరకు సమాధానం రాలేదని పేర్కొంది. వారి నుంచి సమాధానం రాగానే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేస్తామని కేంద్ర న్యాయశాఖ అండర్ సెక్రటరీ ఎన్‌కేసీ తంగ్ వివరణ ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై కేంద్రం అడిగిన వివరణకు వెంటనే సమాధానం ఇచ్చేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీ ధన్ గోపాల్ దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేంద్ర న్యాయశాఖ అండర్ సెక్రటరీ తంగ్ పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించారు.
ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో జాప్యాన్ని కేంద్రానికి ఆపాదించొద్దని సూచించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు ఇప్పటికే తాము చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి గతేడాది లేఖ రాయగా సెప్టెంబర్ ఐదోతేదీనే సీజేఐ నుంచి వివరణ అందిందని తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో ఉన్న 49 మంది న్యాయమూర్తులను ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు 60:40 నిష్పత్తి ప్రకారం కేటాయించాలని సీజేఐ తెలిపారని తంగ్ వెల్లడించారు.
ఏపీ హైకోర్టుకు ప్రిన్సిపల్ సీటుపై సరైన అథారిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డట్లు తెలిపారు. హైకోర్టును విభజిస్తే న్యాయమూర్తులను ప్రాంతాల ఆధారంగా కేటాయించే అంశాన్ని నిర్ణయించాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయగా, న్యాయమూర్తుల ఆప్షనపై ఇప్పటికే నివేదిక తయారు చేసినట్లు సమాధానమిచ్చారని చెప్పారు. హైకోర్టు ఏర్పాటు అంశంపై ఏపీ సీఎంకు లేఖ రాసినా ఆయన నుంచి సమాధానం రాలేదని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన లేఖలో వివరించారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు స్థలం ఎంపిక బాధ్యత పూర్తిగా ఏపీ ప్రభుత్వంపైనే ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి వివరణ వచ్చిందని, ఏపీ సీఎం నుంచి మాత్రం స్పందన లేదని తంగ్ తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హైకోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయటం రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టు సహాయకుడు, మాజీ అడ్వకేట్ జనరల్ ఈ మనోహర్ అన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రాసిన లేఖ చట్ట విరుద్ధమని, ఆ లేఖతోనే సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఆయన వాదనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా స్పందిస్తూ హైదారాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నప్పుడు ఏపీ హైకోర్టును తాత్కాలికంగా నగరంలోనే ఎందుకు ఏర్పాటుచేయకూడదని ప్రశ్నించారు. ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ర్టానికి చెందిన హైకోర్టు ఉండాలని ఆర్టికల్ 214 లో ఉందని మనోహర్ వివరించారు. ప్రత్యేక హైకోర్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్లో కూడా తప్పులున్నాయని ఆయన అనడంతో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కే రామకృష్ణా రెడ్డి అభ్యంతరం తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని ఏజీని సముదాయించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల ఏడోతేదీకి వాయిదా వేసింది.
ప్రత్యేక హైకోర్టుపై వ్యాజ్యంలో కోర్టు సహాయకుడిగా వ్యవహరిస్తున్న మనోహర్ వ్యవహారశైలి న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏపీ రాష్ట్ర పరిధిలోనే ఏర్పాటు చేయాలని వాదించిన ఆయన, అంతకుముందు ఏపీ వాహనాల రవాణాపన్ను కేసులో అందుకు భిన్నంగా వాదించారు. ఏపీ వాహనాలను ఇతర రాష్ట్ర వాహనాలుగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌చేస్తూ.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఏపీ వాహనాలకు రవాణా పన్ను విధించరాదని వాదించారు. అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన సీనియర్ న్యాయవాది ఇలా భిన్నమైన వాదనలు చేయడంపై న్యాయవాద వర్గాలు ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.




