
బచావత్ తీర్పుకు విరుద్దంగా ఎపి తొండాట
కృష్ణాజలాల విడుదలలో ఆంధ్ర సర్కారు దాష్టీకం
మంత్రి హరీశ్ ఫైర్
హైదరాబాద్,జనవరి3(జనంసాక్షి): నీటి వాడకాలు, కేటాయింపుల్లో ఎపి ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బచావత్ నిబంధనల మేరకు రావాల్సిన నీటి కేటాయింపులను ఎపి అడ్డుకుంటోందని అన్నారు. తెలంగాణ రైతుల పొలాలను ఎండగట్టే దురాలోచనతో చట్టవిరుద్దంగా వ్యవహరిస్తూ చర్చలకు కూడా ఎపి సర్కార్ ముందుకు రావడం లేదన్నారు. శనివారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావుతో కలసి విూడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కార్ కాలు దువ్వి గిల్లికజ్జాలు పెట్టుకుంటోందన్నారు. రబీ పంటను కాపాడుకోవడం కోసం నాగార్జునసాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని నల్గొండ ప్రజాప్రతినిధులు కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సాగర్ నీటి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రబీ సీజన్‌లో పంటలకు నీరు విడుదల చేయాల్సి ఉన్నా, నిబంధనల మేరకు రావాల్సిన వాటను కూడా అడ్డుకుంటున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటోందన్నారు. ఏపీకి ఉన్న నీటి వాటా కంటే 8 టీఎంసీలు ఇప్పటికే ఎక్కువ వాడుకున్నదని హరీష్ రావు అన్నారు. కృష్ణాజలాల విషయంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వానిది మొండి, తొండి వాదన అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అవసరం మేరకు వాడుకుని ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఏపీ సర్కార్ మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. నీటికేటాయింపులనకు ఇప్పుడు బచావత్ మాత్రమే ప్రామాణికమన్నారు. కేటాయించిన 321 టీఎంసీలకు గాను 329 టీఎంసీలను ఏపీ వాడుకుంటుంది. మానవతదృక్పథంతో రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో ఖరీఫ్‌లో ఎక్కువ వాడుకోవడానికి అవకాశం ఇచ్చాం. వాటా కంటే ఎక్కువ వాడుకోని ఇప్పుడు లెక్కల ముచ్చట వద్దంటున్నారని అన్నారు. శ్రీశైలం, సాగర్‌లో ఉన్న 101 టీఎంసీలు మాకే కావాలని ఏపీ అంటోంది. తెలంగాణ రైతులకు నీటిని ఇవ్వడానికి ఎపి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మంత్రి టి.హరీస్ రావు ఆరోంచారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడే తాము నీటిని అడుగుతున్నా, ఎపి సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు 200 టి.ఎమ్.సిలు, ఎపికి 280 టి.ఎమ్.సిలు ప్రాజెక్టులవారీగా వస్తాయని ఆయన చెప్పారు. సాగర్ లో ఇంకా అదనంగా 135 టి.ఎమ్.సిలు అందుబాటులో ఉన్నాయని,లాసెస్ పోను మిగిలిన 550 టి.ఎమ్.సిలలో తెలంగాణకు 229 టి.ఎమ్.సిలు వస్తాయని హరీష్ రావు తెలిపారు.జూరాల-సాగర్ మధ్య ఉన్న నీటి కేటాయింపులని అన్నారు.ఇంతవరకు తెలంగాణ కేవలం 117 టి.ఎమ్.సిలు వాడుకోగా,ఎపి 329 టి.ఎమ్.సిలు వాడుకున్నదని ఆయన చెప్పారు. ఇప్పటికే ఎనిమిది టి.ఎమ్.సిలు వాడుకున్న ఎపి ఖరీఫ్ కోసం 41, రబీకోసం మరో 200 టి.ఎమ్.సిలు కావాలంటున్నదని అన్నారు. కృష్ణ డెల్టాకు మరో ఇరవై ఆరు టి.ఎమ్.సిలు కావాలంటే, వాడుకుని, వచ్చేసీజన్ లో తమకు తిరిగి ఇవ్వాలని సూచించామని హరీష్ రావు చెప్పారు.దానికి కూడా ఎపి అంగీకరించలేదని అన్నారు.ప్రతిసారి గిల్లి కిజ్జాలను ఎపి పెడుతున్నదని అన్నారు. అదనంగా నీటిని వాడుకుని ఇప్పుడు లెక్కలు వద్దని అంటున్నదని అన్నారు.శ్రీశైలం, సాగర్
లలో ఉన్న మొత్తం 101 టి.ఎమ్.సి. ల నీటిని తమకే కావాలంటున్నదని ఆయన అన్నారు. జలాశయాలు ఖాళీ చేస్తే మొత్తం నీళ్లు మాకే కావాలని ఏపీ అంటోంది. తెలంగాణను ఎండబెట్టాలని చూస్తున్న చంద్రబాబు తీరుపై టీ టీడీపీ నేతల వైఖరి చెప్పాలన్నారు. టీ టీడీపీ నేతలు చంద్రబాబును సమర్థిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. నదీ జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, నీళ్ల దోపిడీని సహించేది లేదని చెప్పారు. నీటి విడుదలపై ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఎటూ తేల్చకుండా ముందుకెళుతందని హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితులను ఏపీ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఈ విషయాన్ని కృష్ణాబోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రెండు రాష్టాల్రు చర్చించుకుని రావాలని కృష్ణాబోర్డు అధికారులు తెలిపారని హరీశ్‌రావు వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. కృష్ణానదీ జలాల పంపకం విషయంలో బచావత్ ట్రైబ్యునల్ తీర్పు అంతిమమని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల వైఖరి ఏంటో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. టీ.టీడీపీ నేతలు ఎంతకాలం చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంపు ద్వారా భద్రాద్రి రాముడిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. రాజధాని శివార్లలో భూ వివాదంలో తన బంధువులంటూ వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు చేసే టీడీపీ నేతలు వాటిని రుజువు చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు. నిన్నటి దాకా భద్రాచలం గుడి భూములు ముంచిండు, ఇప్పుడు చంద్రబాబు గుడిని కూడా ముంచుతున్నడు. పక్క రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నడు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని చంద్రబాబు మరో కుట్రకు పాల్పడుతున్నాడు. పోలవరం ఎత్తు పెంచడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఆదివాసీలను ముంచుతామంటే సహించం. ఏపీ కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం. టీ టీడీపీ నేతలు తప్పుడు కూతలు మానాలి. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి మా నీటి వాటాను మేం వాడుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల వద్ద రక్షణ బలగాలు అవసరమన్న ఎపి
ఇదిలావుంటే అన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో రక్షణ చర్యలు చేపట్టాలని ఎపి ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్రానికి ఎపి ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం నీటి విడుదలకు సంబంధించి,నిర్దిష్ట ప్రామాణికాలను ఉల్లంఘిస్తోందని ఎపి ఆరోపించింది. శ్రీశైలంలో జల విద్యుత్ ను నిర్దిష్ట నియమాలతో సంబంధం లేకుండా చేయడం వల్ల ఎపికి నష్టం జరిగిందని, రాయలసీమకు తాగునీటిని ఇవ్వడం కష్టం అయిందని పేర్కొంది.అలాగే ఎస్.ఆర్.బి.సి.తెలుగు గంగ వంటికి నీటి సరఫరా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిందని ఎపి వాదించింది. కృష్ణబోర్డు ఆదేశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎపి ఫిర్యాదు చేసింది.ఈ నేపధ్యంలో కేంద్ర బలగాలను ప్రాజెక్టుల వద్ద ఏర్పాటు చేయాలని ఎపి కోరింది.




