పెద్ద నోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై భారీగా పడినందున కేంద్రం తాత్కాలిక ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. నోట్ల ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు చేయాల్సిన సాయంపై ఆరు అంశాలతో కూడిన ప్రతిపాదనలను కేంద్రానికి అందించారు. అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జిఎస్‌టి గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు లేకుండా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీతో సమావేశమై పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్రాలకు ఎదురవుతున్న సమస్యలను చర్చించారు. పెద్ద నోట్ల రద్దు మూలంగా రాష్ట్ర పన్నుల రాబడి 25 నుంచి 30 శాతం వరకు తగ్గిందని జైట్లీకి చెప్పినట్టు మంత్రి ఈటల మీడియాకు వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎంతకాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం కనుక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు జిఎస్‌టి నష్టపరిహారం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్రాన్ని కోరామన్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ రుణ చెల్లింపులపై మారిటోరియం విధించాలనే ప్రతిపాదన కూడా చేసినట్టు రాజేందర్ వెల్లడించారు. దీనివలన రాష్ట్రాలకు కొంతవెసులు బాటు ఉంటుందన్నారు.
తెలంగాణ బడ్జెట్ పై భారం




