Tuesday, 3 November 2026

తెలంగాణ రైతులకు సోలార్‌ పంపుసెట్లు … సీఎం కేసీఆర్‌ సమీక్ష

22
హైదరాబాద్‌, నవంబర్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ రైతులకు సోలార్‌ పంపుసెట్లు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణలో రైతులకు సోలార్‌ పంపుసెట్లు సమకూర్చే అంశంపై సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. బొగ్గు, గ్యాస్‌తో సహా ఇతర వనరులన్నీ ఏదో ఒక సమయంలో పూర్తిగా తరిగిపోవాల్సినవేనని, అంతిమంగా సౌరశక్తిపైనే ఆధారపడాల్సి వుందని కేసీఆర్‌ అన్నారు. కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేంద్ర వి.మహజన్‌, జిఎం అజయ్‌ విరోద్కర్‌, ఇతర ప్రతినిధులు సోలార్‌ పంపుసెట్లు సమకూర్చే అంశంపై పలు ప్రతిపాదనలు చేశారు. విద్యుత్‌ కోతలు, సరఫరా దేశాల్లో అనిశ్చిత, విద్యుత్‌ అందుబాటులో అస్థిరత, విద్యుత్‌ సరఫరాలో జరిగే నష్టాలు తదితర సమస్యలకు సౌరశక్తితో నడిచే వ్యవసాయ మోటార్‌ పంపులు చాలా ఉపయోగమని అన్నారు. అయితే తెలంగాణలోనే 20లక్షల పంపుసెట్లకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత విద్యుత్‌ వల్ల ఎక్కువ భారా? సోలార్‌ పంపుసెట్లు సమకూర్చడం ఎక్కువ భారమా? అనే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులకు 7గంటల విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల రోజుకు 30 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ అవసరమవుతోందని, దీనికి రోజుకు 15కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని అంచనా వేశారు. సోలార్‌ పంపుసెట్ల వల్ల అయ్యే ఖర్చును అంచనా వేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సోలార్‌ పంపుసెట్లను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో 240 కోట్లు కేటాయించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ మొత్తం ఒకేసారి కాకుండా, పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం అన్నారు. దీనివల్ల సోలార్‌ పంపుసెట్ల విధానం ఎంతవరకు ఆచరణీయమనే విషయం అనుభవంలోకి వస్తుందన్నారు. మొదటి ఏడాది లక్ష పంపుసెట్లు అందుబాటులోకి తెస్తామని, పదేళ్ళలో తెలంగాణలోని రైతులందరికీ ఇప్పుడున్న మోటార్ల స్థానంలో సోలార్‌ పంపుసెట్లు ఇస్తామని కిర్లోస్కర్‌ కంపెనీ ప్రతినిధులు ప్రతిపాదించారు. పదేళ్ళపాటు మోటార్ల నిర్వహణ బాధ్యత కూడా తామే చూస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన డబ్బులు కూడా పదేళ్ళ తరువాత చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. మరికొన్ని కంపెనీల ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రభుత్వ సలహాదారు బివి.పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు, ప్రభుత్వ కార్యదర్శులు ప్రదీప్‌చంద్ర, నాగిరెడ్డి, ఎస్‌కె.జోషి, పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *