Tuesday, 3 November 2026

తెలంగాణ వచ్చే వరకూ పోరు కొనసాగుతది

రౌండ్‌ టేబుల్‌ సమావేశం యథాతథం : కోదండరామ్‌

హైదరాబాద్‌, జూలై 3 (జనంసాక్షి) :

తెలంగాణ వచ్చే వరకూ పోరు కొనసాగుతుందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై హంగామా చేస్తున్న నేపథ్యంలో టీ జేఏసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని ప్రశ్నించగా ఎవరెన్ని చెప్పినా తెలంగాణ వచ్చే వరకూ ఉద్యమం ఆపబోమన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీకి హడావుడి చేయడమే ఇదే మొదటిసారి కాదని అన్నారు. 2009 నుంచి ఇప్పటి వరకూ పలు సందర్భాల్లో తెలంగాణపై ఏదో నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పడం, తర్వాత మాట తప్పడం పరిపాటిగా మారిందన్నారు. తెలంగాణ సమస్యను వారం, పది రోజుల్లో తేల్చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీపై మరింత ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. దిగ్విజయ్‌ ప్రకటనతోనే ఢిల్లీలో నిర్వహించతలపెట్టిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఆపబోమన్నారు. యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై తెలంగాణ ప్రజల పక్షాన ఒత్తిడి పెంచే చర్యలు కొనసాగిస్తామన్నారు. తెలంగాణలోని పది జిల్లాల ప్రజలు 1956కు ముందున్న తెలంగాణ కోరుకుంటున్నారని తెలిపారు. రాయల తెలంగాణ తమకు అవసరమే లేదన్నారు. అలాగే తెలంగాణలోని ఒక్క ప్రాంతాన్ని కూడా ఒదులోకోబోమన్నారు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించే పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పి తీరుతారన్నారు. దిగ్విజయ్‌సింగ్‌, గులాంనబీ ఆజాద్‌, వయలార్‌ రవి ఇలా కాంగ్రెస్‌ పార్టీకి ఎవరు ఇన్‌చార్జిలుగా వచ్చిన తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నించలేదున్నారు. ఇప్పుడు మళ్లీ దిగ్విజయ్‌ ఏదో తేల్చేస్తామన్నా అంత సులువుగా నమ్మబోమన్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారానే సాధ్యమని, అలుపెరుగకుండా చేస్తున్న పోరాటాలతోనే కాంగ్రెస్‌ ఇప్పుడు ఈ చర్యకు పూనుకొని ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. ఎవరెన్ని చెప్పినా ఉద్యమ బాటను వీడబోమన్నారు. ఉద్యమ నిర్వహణ, నిర్మాణంలో ఎంతమాత్రం అలక్షం వహించిన స్వార్థ శక్తులు దానిని తప్పుగా ప్రచారం చేస్తాయని అన్నారు. రాజకీయ స్వార్థ చర్యలకు కాకుండా ప్రజల ఆకాంక్షలకు అన్ని రాజకీయ పార్టీలు విలువనిస్తే కలకాలం ప్రజల్లో ఉండిపోతాయని హితవు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏవో ప్రత్యామ్నాయాలు చూపబోతున్నారంటూ సీమాంధ్ర మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని అది ఎంతమాత్రం సరికాదన్నారు. ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించడమే పనిగా పెట్టుకున్న కొన్ని స్వార్థ శక్తులు ఈ ప్రచారానికి పూనుకుంటున్నాయని ఆరోపించారు. అలాంటి శక్తులకూ బుద్ధిచెప్పి తీరుతామన్నారు. తెలంగాణపై ఇకనైనా తేల్చకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *