విజయవాడ,ఆగస్ట్6(జనం సాక్షి ): తెలుగు భాష రక్షణ మన ఇంటి నుంచే ప్రారంభంకావాలని ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. దుకాణాలు, రెస్టారెంట్ల ముందు తెలుగులో నామఫలకాలు ఉంచకపోతే రూ. 2వేలు జరీమాన విధిస్తామని ఆయన అన్నారు. తెలుగు భాష పరిరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారాన్ని తెలుగు మల్లి సంస్థ నిర్మాహకులు కొంచాడ మల్లికేశ్వరరావుకు అందజేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ గాయనీ సుశీల, తెలంగాణ సంస్కృతి సలహాదారు కేవీ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుశీల కీర్తన ఆలపించి అందరినీ అలరించారు.




