శ్రీలంక అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన
ముందస్తు ఎన్నికల్లో రాజపక్సె ఓటమి
కొలంబో,జనవరి9(జనంసాక్షి): శ్రీలంక అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన ఘన విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు రాజపక్సెపై ఆయన విజయం సాధించారు. గురువారం జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. సిరిసేనకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. ప్రస్తుత అధ్యక్షుడు మహింద రాజపక్సే ఓటమిని అంగీకరించి అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. సిరిసేన గతంలో రాజపక్సేకు మంచి స్నేహితుడు. రాజపక్సే ప్రభుత్వంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రాజపక్సే ప్రభుత్వం గడువు ముగియడానికి రెండేళ్ల ముందే ఎన్నికలకు పిలుపునిచ్చిన వెంటనే సిరిసేన ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ తరఫున రాజపక్సే, విపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సిరిసేన పోటీ చేశారు. వీరితో పాటు 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీలంకలో ఈసారి భారీ ఓటింగ్ నమోదైంది. తమిళ, ముస్లిం ప్రాంతాలలో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు, రాజపక్సేపై మైనార్టీలు, తమిళులకు ఉన్న వ్యతిరేకత సిరిసేనకు కలిసొచ్చే అంశాలుగా మారాయి. అంతేకాకుండా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సిరిసేనకు ప్రజల్లో మంచి పేరుంది. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మైత్రిపాల సిరిసేనకు భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. శ్రీలంకలో శాంతి, అభివృద్ధికి సహకరిస్తామని మోదీ స్పష్టం చేశారు. మైత్రిపాల సిరిసేనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది.




