ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని వీలైనంత త్వరగానే నెరవేరుస్తమన్నారు సీఎం కేసీఆర్. రాబోయే రోజుల్లో ప్రభుత్వం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయగానే ఉద్యోగాల భర్తీ మొదలవుతుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆంధ్రా కాంట్రాక్టు ఉద్యోగుల విభజన కూడా పూర్తయితే.. క్రమబద్దీకరణ సులభమవుతుందన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్.. సభకు తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. ఇప్పుడున్న టీచర్లలో చాలా మందికి ఆంగ్ల భాషా నైపుణ్యం లేదని వివరించారు. తొందరపడి ఉచిత విద్య పథకాన్ని అభాసుపాలు చేయదలచుకోలేదన్నారు. పకడ్బంధీగా కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేసి తీరుతామని చెప్పారు.
ఈ విద్యాసంవత్సరం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలన్నీ త్వరలో చెల్లిస్తామన్నారు సీఎం కేసీఆర్. గత ప్రభుత్వాలు తమపై వదిలేసిన బకాయిలను ఇప్పటికే విడుదల చేశామన్నారు. అటు కాలేజీలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచుకుంటే కుదరదన్నారు. 371 డి ని అనుసరించి స్థానికులుగా గుర్తింపు పొందిన వారందరికీ రీయింబర్స్ మెంట్ వర్తిస్తుందన్నారు.
ఐసీడీఎస్ పథకం నిధుల్లో కేంద్రం 50 శాతం కోత పెట్టడం సరికాదన్నారు సీఎం కేసీఆర్. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు చెప్పామన్నారు. అంగన్ వాడీలకు కనీసం గత ప్రభుత్వాలు వంటపాత్రలు కూడా కొనిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఇబ్బంది అయినా తెలంగాణ రాష్ట్రంలో అంగన్ వాడీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం ప్రకటించారు.
గతంలో హామీ ఇచ్చినట్లు అన్ని జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఏర్పాటు చేసి తీరుతామన్నారు సీఎం కేసీఆర్. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్ల అభివృద్ధి కోసం ఇప్పటికే వందకోట్ల నిధులు కేటాయించామన్నారు. నెల రోజుల్లో కొత్తగా వెయ్యి 104,108 వాహనాలు అందుబాటులోకి తేనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.




