చెన్నై,డిసెంబర్24(): దర్శక శిఖరం కె.బాలచందర్‌కు తమిళనాట కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలకు అళేశ జనవాహిని హాజరయ్యారు. ప్రముఖులు నివాళులర్పించారు. సూపర్‌స్టార్ రజినీకాంత్, అలనాటి నటి కాంచన, హీరో అర్జున్, హీరో సూర్యా తండ్రి శివకుమార్, హీరో విజయ్, నటుడు శుభలేక సుధాకర్, సంగీత దర్శకులు ఇళయరాజా, ఎఆర్ రెహమాన్, నటి కుష్బూ, దర్శకులు పి.వాసు, కేఎస్ రవికుమార్, డీఎంకే నేత స్టాలిన్, మనోరమా, ఆర్బీచౌదరి, కేంద్రమాజీ మంత్రి చిదంబరం, ప్రముఖ పాత్రికేయులు చోరామస్వామి,
హాస్యనటుడు వివేక్ తదితరులు బాలచందర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. బాలచందర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. సినీ, టీవీ కళాకారులు పెద్ద సంఖ్యలో బాలచందర్ నివాసానికి చేరుకుని ఆయన పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తనకు ఆయన సినిమాలో పాటలు పాడే అవకాశం కల్పించిన పెద్ద మనిషి బాలచందర్ అని గాయని వాణీ జయరామ్ అన్నారు.
కమలహాసన్ కు దక్కని ‘చివరిచూపు’
తన గురువు కె. బాలచందర్ ను కడసారి దర్శించుకునే అవకాశాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ కోల్పోయారు. అమెరికా నుంచి ఆయన ఈ రాత్రికి చెన్నై చేరుకునే అవకాశముంది. బాలచందర్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం ముగియనున్నాయి. తన తాజా చిత్రం ‘ఉత్తమ్ విలన్’ పోస్టు ప్రొడక్షన్ పనుల కోసం కమలహాసన్… లాస్ ఏంజెలెస్ కు వెళ్లారు.బాలచందర్ మరణవార్త తెలియగానే ఈ తెల్లవారుజామున కాలిఫోర్నియా నుంచి ఆయన బయలుదేరారని, ఈ రాత్రికి చెన్నై చేరుకుంటారని కమలహాసన్ మేనేజర్ తెలిపారు. బాలచందర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారని చెప్పారు. బాలచందర్ తో కలిసి 40పైగా సినిమాలకు కమలహాసన్ పనిచేశారు.




