
-థర్మల్, హైడ్రల్, పవన, సౌర విద్యుత్‌పై అధ్యయం చేయండి
-సీఎం కేసీఆర్
రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎంను కలిసిన గ్రీన్ కో ప్రతినిధులు 2018లోగా రాష్ట్రంలో ఆరువేల కోట్ల రూపాయల పెట్టుబడితో 800 మెగావాట్ల సామర్ధ్యం వరకు సౌర పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. ఇందుకోసం అవసరమైన భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తితోపాటు సౌర, పవన విద్యుత్ అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే సౌరవిద్యుత్ కోసం మరోమారు టెండర్లు పిలవాలని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల మెగావాట్ల వరకు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉందని ..పగటి పూట విద్యుత్ అందించే సౌర విద్యుత్ వ్యవస్థను వ్యవసాయ పంపుసెట్లకు అనుసంధానం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో పర్యటన అనంతరం వాటర్ గ్రిడ్ ఏర్పాటుతో పాటు నల్లగొండ జిల్లా నుంచే మంచినీటి సరఫరా మొదలవుతుందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఇప్పుడు కృష్ణా నదీ తీరంలో వీలున్న ప్రదేశాలలో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగా కృష్ణా తీర ప్రాంతంలో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేయాలనే సర్వే నిర్వహించారు. దీనికి జెన్‌కో రూ. 55 వేల కోట్ల నిధులను ఖర్చుచేయనుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి రైల్వే, రహదారుల సౌకర్యాలున్నాయి. బందర్, కృష్ణపట్నం ఓడరేవుల నుంచి నేరుగా ఇక్కడికి బొగ్గును దిగుమతి చేసుకోవచ్చని తెలిపారు. అంతేగాక కృష్ణాతీరంలో భారీ పెట్టుబడులు పెడుతుండటంతోమెగా టౌన్‌షిప్‌గా మారే అవకాశముందన్నారు. దశల వారీగా ఇక్కడ, గృహాలు, ఆసుపత్రులు, ఆహ్లాద ప్రదేశాలను నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్ష మందికిఉపాధి లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కృష్ణా తీర ప్రాంతంలో విహంగ వీక్షణం జరిపిన అనంతరం ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌తో సవిూక్షించిన అంశాలను వెల్లడించారు. తీర ప్రాంతంలైన దామరచర్ల, మఠంపల్లి, మేళ్లచెర్వు మండలాలు విద్యుత్ కేంద్రాలకు అనుకూలంగా ఉన్నాయి. విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు 7500 ఎకరాల భూములు కావాల్సిఉంటుంది. సేకరించే అటవీ భూములకు బదులుగా కేంద్రానికి ప్రభుత్వ భూములు అప్పగించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉందన్నారు. అటవీ భూములకు సంబంధించిన అనుమతులను వీలైనంత త్వరలో కేసీఆర్ సంపాదిస్తారని తెలిపారు. ఈ ప్రాంతంలో తొలి విడతగా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని వీర్లపాలెం వద్ద థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. మరో రెండువిడతల్లో అనుకూల ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడతారని అన్నారు.




