హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్-సియోని జిల్లాల సరిహద్దుల్లో ముగ్గురు దళిత యువకుల సజీవదహనం ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని కులవివక్ష పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ సంస్థ అధ్యక్షుడు కొండమడుగు నర్సింహ, ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హత్యా సంఘటన జరిగి రెండు రోజులైనా పోలీసులు ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక పోతే దళితులు తిరగబడతారని హెచ్చరించారు.
హత్యా సంఘటనను వివరిస్తూ… బాలాఘాట్-సియోని సరిహద్దుల్లో అగ్రకులానికి చెందిన యువతిని దళిత యువకుడైన దీపక్ ప్రేమించాడనే అనుమానంతో దీపక్‌ను అతని ఇద్దరు మిత్రులు రాజేష్, నిహాల్‌లను అగ్రకులాలకు చెందిన వారు సజీవ దహనం చేశారని ఆరోపించారు.




