రాష్ట్ర మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును గురువారం పోలీసులు అరెస్టు చేసిన తీరు చూస్తే దాని వెనుక సీమాంధ్ర పెత్తందారుల కుట్ర దాగి ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానానికి, నెహ్రూ కుటుంబానికి వాచ్డాగ్ వాడిలాంటివాడినని, వారిపై ఎవరూ మాట్లాడినా అడ్డుకుంటానని అనునిత్యం చెప్పే శంకర్రావును అదే కాంగ్రెస్ పార్టీ పాలకులు అత్యంత అవమానకరంగా అరెస్టు చేయించారు. కనీసం లుంగీ కట్టుకోనివ్వకుండా, చొక్కా గుండీలు పెట్టుకోనివ్వకుండా బయటకు ఈడ్చుకొచ్చారు. మీడియా సమక్షంలోనే అత్యంత హేయంగా వ్యవహరించారు పోలీసులు. ఒక ప్రజాప్రతినిధిపై బహాటంగా ఇంత దుర్మార్గానికి తెగబడ్డారంటే వారి కష్టడిలో ఉన్న వారిపట్ల ఇంకెలా వ్యవహరిస్తారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీ పెద్దల చెప్పుచేతల్లో నడుస్తుందో, సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో నడుస్తుందో అర్థంకాని పరిస్థితి. అదే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజల సంపదను ఇతరులకు దోచిపెడితే, వ్యవస్థీకృతమైన నేరాలకు పాల్పడితే వారిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోంది. పైపెచ్చు న్యాయ సహాయం అందిస్తూ వారు చేసింది తప్పేకాదని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటోంది. అదే తెలంగాణ ప్రాంతానికి చెందిన దళితుడు, తెలంగాణవాదం గట్టిగా వినిపించే ఓ నాయకుడి పట్ల ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఇంతకు మించిన వివక్ష ఇంకేం కావాలి. జగన్ అక్రమాస్తుల కేసుకు మూల కారణమైన 26 జీవోలు జారీ చేసిన రాష్ట్ర మంత్రుల్లో ధర్మాన ప్రసాద్‌రావు ఒకరు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని అత్యంత విలువైన భూములను పోర్ట్‌లు, వాడరేవు, విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రాక్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆయన భూమిక ఇంతా అని చెప్పలేం. అలాంటి వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వమని సీబీఐ కోరితే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. జీవో జారీకి మాత్రమే మంత్రులు బాధ్యులని, తర్వాత జరిగే తెరచాటు వ్యవహారాలతో తమకేమి సంబంధమంటూ అడ్డుగోలుగా మాట్లాడింది. ఆయనతో పాటు జీవోల కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విచారణ ఎదుర్కొంటున్న మిగతా మంత్రులకు న్యాయ సహాయం అందించాలని నిర్ణయించి పరువులేని ప్రభుత్వంగా ముద్రవేసుకుంది. తప్పు జరిగిందంటే ఆ తప్పులో అమాత్యులకు బాధ్యత లేదనడం ఎంతవరకు సమంజసం. ఈ వ్యవహారంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రుల ప్రమేయమున్నా వారంతా సీమాంధ్ర పెట్టుబడిదారులకు అత్యంత సన్నిహితులే. అడపా దడపా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినా ఎక్కువగా మారు ఆలపించేది పెట్టుబడిదారుల ట్యూనే. కానీ శంకర్రావు అలా కాదు, అధిష్టానంపై విశ్వాసంతో ముఖ్యమంత్రి పనితీరును ఎండగట్టాడు. పార్టీ నుంచి బయటికి వెళ్లి సొంతపార్టీ పెట్టుకున్నవారిని ఆరోపణలతో చీల్చిచెండాడు. అలాంటి ఆయనను కాంగ్రెస్ పార్టీ కాపాడాల్సింది పోయి పెట్టుబడుదారులతో కుమ్మకై దారుణంగా అవమానించింది. కేవలం దళితుడని, తెలంగాణవాది అని, ముఖ్యమంత్రి సహకారంతో చిత్తూరు జిల్లాలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నాడనే అరెస్టు చేయించింది. ఇందుకు ఆయనపై మోపిన అభియోగం ఓ ప్రైవేటు కేసు. హైదరాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ భూములను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆక్రమించుకున్నాడని, ఫ్లాట్స్ యజమానులను ఇబ్బంది పెట్టాడని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంత నేతలు రాష్ట్ర సంపదన కొళ్లగొట్టిన దానితో పోలిస్తే ఇది చాలా చిన్నకేసు. ఫ్లాట్స్ యజమానులకు ఏదైనా నష్టం జరిగితే పూడ్చే అవకాశముంది. వ్యాన్‌పిక్ కేసులో రస్ అల్ ఖైమా (రాక్) ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని అంత సులభంగా రద్దు చేసుకోలేం. కేసు చిన్నదైనా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణవాడు కావడంతో సీమాంధ్ర పెత్తందారులు ఆయనపై విషం కక్కారు. తెలంగాణ కోరుకుంటున్న అందరిని ఇలాగే అరెస్టు చేసి జైళ్లో పెట్టడానికి సంకల్పించారు. పూర్తిగా కోలుకోని శంకర్రావును అరెస్టు చేసే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుతో ఆయన ఖిన్నుడైపోయారు. ఫలితంగా అరెస్టు చేసిన కొద్దిసేపటికే గాంధీ ఆస్పత్రికి, అక్కడి నుంచి కేర్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. సీమాంధ్ర సర్కారు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా దళిత మంత్రులు తప్ప మరెవరూ ప్రభుత్వ చర్యను తప్పుబట్టకపోవడం వారి బానిస మనస్తత్వాన్ని మరోసారి బహిర్గత పరుస్తోంది. జానారెడ్డి ఒక్కరే పోలీసులు దుందుడుకుగా వ్యవహరించారని అన్నాడే తప్ప మరే మంత్రి కనీసం మట్లాడే సాహసం కూడా చేయలేదు. ఏం మాట్లాడితే పదవి ఊడుద్దో అనే భయంతోనే సీమాంధ్ర పెద్దలకు మోఖరిల్లుతున్నారు. ఇది కాదు తెలంగాణ ప్రజల స్వభావం. బానిసత్వం మనది కాదు, కాని మన మంత్రులను నిలువెల్లా బానిసత్వ మనస్తత్వం ఆవరించింది. ఇది క్షేమకరం కాదు. ఇలాంటి వారు మన అమాత్యులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. మంత్రి పదవి ఉన్నా ఊడినా శంకర్రావులాగా ప్రజల ఆకాంక్షలు వ్యక్త పరిచే వారిని ఇక్కడి ప్రతి గుండె అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది.




