– పిల్లల శవాలతో రాస్తారోకో
– రాహుల్ పరామర్శ, మోదీ మౌనం దేశానికి ప్రమాదకరం
– ముస్లింలు, దళితులు లక్ష్యంగా దాడులు
– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్
ఫరిదాబాద్, అక్టోబర్21(జనంసాక్షి): హర్యానాలోని ఫరిదాబాద్ ఘటనపై దళితులు ఆందోళనకు దిగారు. అగ్రవర్ణాలు ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో సజీవ దహనమైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలతో ఢిల్లీ, ఆగ్రా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగేంత వరకు రెండున్నర ఏళ్ళ వైభవ్, 11 నెలల దివ్య మృతదేహాలను ఖననం చేయబోమంటూ ప్రధాన రహదారిని దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్థంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఆ గ్రామాన్ని సందర్శించేందుకు సిద్థమైన సీఎం మనోహర్ లాల్ ఖత్తర్, దళితుల ఆందోళన కారణంగా పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ దారుణ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. అగ్రవర్ణాలు, దళితుల మధ్య నెలకొన్న వివాదంతో అక్కడ ఏడాదిగా పోలీస్ బీట్ నిర్వహిస్తున్నారు. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన ఆరోపణలతో సోమవారం విధుల్లో ఉన్న 8 మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారిలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 70 శాతం కాలిన గాయాలతో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లి రేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పిల్లల సజీవదహనంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశం
ఫరీదాబాద్‌లో జరిగిన పిల్లల సజీవదహనం ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరించింది. ఎంపీ క్రిష్ణ్ పాల్ గుర్జార్ ఈ సంగతి వెల్లడించారు. దాంతో గ్రామస్థులు పిల్లల అంత్యక్రియలు నిర్వహించడానికి అంగీకరించారు. ఈ సంఘటనపై స్థానికులు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దిల్లీ సమీపంలో ఫరీదాబాద్‌లోని ప్రీత్లా ప్రాంతానికి చెందిన ఓ దళిత కుటుంబం గత సోమవారం రాత్రి నిద్రిస్తుండగా.. కొందరు వ్యక్తులు వారి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో మూడేళ్ల లోపు వయసున్న ఇద్దరు చిన్నారులు సజీవదహనమవగా, వారి తల్లి 70 శాతం గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై ప్రీత్లా గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని, ఈ దారుణానికి పాల్పడిన వాళ్లను శిక్షించాలంటూ ఫరీదాబాద్-బల్లభగర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. నిందితులను అరెస్టు చేసేవరకు పిల్లల అంత్యక్రియలు నిర్వహించబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం మధ్యాహ్నం ఫరీదాబాద్‌లో పర్యటించారు. చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు. గ్రామస్థులతో మాట్లాడారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా పర్యటించాలనుకున్నారు కానీ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంపీ క్రిష్ణ్ పాల్ గుర్జార్ జోక్యం చేసుకుని గ్రామస్థులకు నచ్చజెప్పారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని మాత్రమే అరెస్టు చేశారు. మిగిలినవారు పరారీలో ఉన్నారు.
మోదీపై రాహుల్ ఫైర్
ఢిల్లీ శివారులోని హర్యానాకు చెందిన సున్ పెడ్ గ్రామంలో ఓ అగ్రవర్ణానికి చెందినవారి దాడికి గురైన దళిత కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ, ఆ పార్టీతో సంబంధం ఉన్న ఆరెస్సెస్ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుండటంవల్లే విద్వేషపూరితమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రధాని ధోరణి ఇలాంటి ఘటనలకు కారణం అని, ఇప్పుడు వీటికి ఎవరు సమాధానాలు చెప్తారని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వల్లే హిందుత్వ శక్తులు రెచ్చిపోతున్నాయని, ముస్లింలు దళితులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని రాహుల్ అన్నారు. సమాజంలో బలహీనంగా ఉన్నారో వారే విూ పాలనలో బలవుతున్నారని, బీజేపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి ఆరోపించారు. సున్ పెడ్ గ్రామంలో అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతుండగా ఓ దళిత కుటుంబం కిటికీలోంచి అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులుపెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు కూడా తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా తల్లి 70శాతం గాయాలతో ఆస్పత్రిలో ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన దేశంలో సంచలనం సృష్టించడంతో ఇప్పుడు పెద్దపెద్ద నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించే పనిలో పడ్డారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఆ కుటుంబాన్ని పరామర్శించగా.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ కూడా స్వయంగా వెళ్లి పరామర్శించనున్నట్లు తెలిసింది. మరోపక్క, ఆ గ్రామస్థులు రహదారులను దిగ్బందించారు. అగ్రవర్ణాలవారి దురహంకారం నశించాలంటూ తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపైనే భైఠాయించారు. అక్కడే ఉండి తమ నిరసనలు తెలియజేశారు. తమకు న్యాయం జరిగే వరకు చనిపోయిన చిన్నారుల అంత్యక్రియలు చేసేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వారికి న్యాయం చేస్తామని హావిూ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించారు.





