– సెంట్రల్ వర్సీటీలో ఘోరం
– ప్రాణం తీసిన సస్పెన్షన్
– ఉద్రిక్త వాతావరణం
– నేడు తెలంగాణ బంద్‌కు పిలుపు
హైదరాబాద్,జనవరి17(జనంసాక్షి):హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వేముల రోహిత్(28) ఆదివారం సాయంత్రం ఎన్‌ఆర్‌ఎస్ వసతి గృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఘటనలో రోహిత్‌తోపాటు మొత్తం ఐదుగురిని వర్సిటీ బహిష్కరించింది. బహిష్కరణను ఎత్తివేయాలని 14 రోజులుగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. బహిష్కరణ ఎత్తివేయకపోవటంతో వేదనకు గురై రోహిత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. రోహిత్ స్వస్థలం ఏపీలోని గుంటూరు నగరం. సస్పెన్షన్‌ను తట్టుకోలేక మనస్తాపంతో దళిత విద్యార్థి రోహిత్ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. దీనితో హెచ్‌సియులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రోహిత్ పీహెచ్ డీ చేస్తున్నాడు. దీనిపై ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దిగ్భ్రాంతి కలిచివేసిందని, అతనికి ఆత్మవిశ్వాసం ఇవ్వకపోవడం పట్ల పాలన, బీజేపీ ప్రభుత్వం, విద్యార్థులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమాజం, బీజేపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. కొంతకాలంగా నానుతూ వస్తోందని, ఇందులో చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థ అని, పాలన విషయంలో జోక్యం చేసుకోవద్దని అభిప్రాయం వ్యక్తం చేశారు. లోకల్ మినిస్టర్ లేఖ రాశాడని..యూనివర్సిటీ అధికారులకు లేఖ వచ్చిందని అనంతరం విద్యార్థులను సస్పెండ్ చేశారని తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ సగం పాడు చేశారని అనంతరం బీజేపీ కలుషితం చేశారని విమర్శించారు. సంఘటన జరిగినప్పుడు కమిటీ వేయడం జరుగుతుందని, కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి ? దళిత విద్యార్థుల విషయంలో ఎలా పనిచేస్తున్నాయనే దానిపై దృష్టి ఉంటుందన్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని, విద్యార్థుల మధ్య ఒక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రొ.హరగోపాల్ పేర్కొన్నారు. కాగా హెచ్ సీయూలో సస్పెన్షన్ కు గురైన దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ప్రకంపనలు సృష్టిస్తోంది. పలు ప్రజా సంఘాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల హెచ్ సీయూలో కొంతమంది దళిత విద్యార్థులను సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య ఘటనపై అర్పిత హెచ్ సీయూ విద్యార్థి మట్లాడుతూ చదువుల్లో దళితులు పైకి వస్తున్నారని భావించి హత్యలు చేస్తున్నారని అందులో రోహిత్ మృతి ఒక ఉదాహరణ అని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారని, అనంతరం మంత్రి స్మృతి ఇరానీ యూనివర్సిటీకి లేఖ రాశారని తెలిపారు. అనంతరం వర్సిటీపై బీజేపీ తీవ్ర వత్తిడి తెచ్చిందని, తరువాత విద్యార్థులను సస్పెన్షన్ చేశారని తెలిపారు. 14 రోజుల నుండి బయటే ఉంటున్నారని, ఎవరూ ఇంతవరకు రావడం లేదన్నారు. ప్రస్తుతం రోహిత్ మృతదేహం తమమధ్య ఉందని, పోలీసులు వెంటనే వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. వైస్ ఛాన్స్ లర్ వచ్చి మాట్లాడాలని అర్పిత డిమాండ్ చేశారు.
రేపు తెలంగాణ రాష్ట్ర బంద్ ప్రకటించిన విద్యార్థి సంఘాలు
సెంట్రల్ యూనివర్శిటీలో బహిష్కరణకు గురైన పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్యహత్య నేపథ్యంలో టీవీవీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, డీఎస్‌యూ విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. రోహిత్ ఆత్మహత్యకు బహిష్కరణే కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులను మోహరించారు. అధికారులు పరిస్థితిని సవిూక్షిస్తున్నారు.





