Thursday, 5 November 2026

దసరా నుంచి యాదాద్రి పనులు

pylbxjw6నాలువైపులా రాజగోపురాలు, నిత్యకళ్యాణ మండపాలతో యాదాద్రిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయ అభివృద్ధి సాధికార సంస్థను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మహిమాన్విత క్షేత్రంగా మలిచేందుకు సరికొత్త డిజైన్లను ఆమోదించారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్‌…దసరా నుంచి పనులు ప్రారంభించాలన్నారు. భక్తులను అబ్బురపరిచేలా కట్టడాలు చేపట్టాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి 200కోట్లు కేటాయించామని.. త్వరలోనే మరిన్ని నిధులు కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం… ఇందుకోసం పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. ప్రాకారాలు, క్షేత్రాలు, మండపాలు, మాఢవీధులు, కాటేజ్‌లు, పార్క్‌లు, టెంపుల్ సిటీల నిర్మాణంతోపాటు ప్రధాన ఆలయానికి దక్షిణాన ఆసియా ఖండంలోనే తొలిసారిగా 108 అడుగుల కంచులోహ అంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి బృందం డిజైన్లను రూపొందించింది. ఈ డిజైన్లు, లే అవుట్‌లకు యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఎలాంటి విఘ్నాలు లేకుండా యాదాద్రి సుందరీకరణ పనులు చేపడుతామని ఆనంద్ సాయి తెలిపారు.

కొత్తగా తయారుచేసిన లే అవుట్ ప్రకారం గుట్టపై ఉన్న గర్భగుడి , ఆంజనేయ స్వామి ఆలయం యాధావిధిగానే ఉంచాలని నిర్ణయించారు. గుట్టపైకి రాకపోకలు సాగించడానికి వేరు వేరు రహదారులను నిర్మించనున్నారు. గుట్టపైనే బస్‌ స్టాప్‌ నిర్మించనున్నారు. వీఐపీల కోసం ప్రత్యేక రహదారితోపాటు… పాత కాటేజ్‌లను తొలగించి దాతల పేరిట కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఖాళీ ప్రదేశాల్లో సువాసనలు వెదజల్లే మొక్కలను పెంచనున్నారు. అర్చకులు సేద తీరేందుకు అన్ని వసతులతో కాటేజ్‌లను నిర్మించనున్నారు. అటు పూజా సామాగ్రి విక్రయించేందుకు ప్రత్యేక భవనాలను నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో అతిపెద్ద అతిథిగృహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన గుట్టతోపాటు చుట్టుపక్కల ఉన్న కొండల్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నవగిరులతో యాదాద్రిని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త డిజైన్లు రూపొందడంపై ఆలయసిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యాదాద్రి సుందరమైన క్షేత్రంగా వెలసిల్లనుండటంపై భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోనే యాదాద్రి అతిపెద్ద క్షేత్రంగా వెలయనుండడంతో స్థానికులు సంబుర పడుతున్నారు.సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు.

యాదాద్రి అభివృద్ధి పనులు దసరాకు ప్రారంభించి ఏడాదిలోపు ఓ రూపు తీసుకురావాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *