హైదరాబాద్ (జనంసాక్షి ): దిల్ సుఖ్ నగర్ పేలుళ్లు జరిగి నేటికి రెండేళ్లు పూర్తయింది. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతోంది. మొదటి చార్జీ షీట్లో ఐదుగురు నిందితులు ఉన్నారని తేల్చిన ఎన్ఐఏ ఇప్పుడు మరో ముగ్గురి పాత్ర ఉందని తేల్చింది. ఇందులో పూణేకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, కర్నాటకలోని ఓ డాక్టర్ కీలక పాత్రపై ఆరా తీసింది. హైదరాబాద్ బాంబు పేల్చేందుకు కుట్రపన్నిన రియాజ్ భత్కల్..పక్కాప్లాన్తో దారుణానికి పాల్పడ్డాడు. 2012లో పాకిస్థాన్ నుంచి స్కెచ్ వేసి.. ఒకరికొకరు తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పేలుడు పదార్థాలు సమీకరించేందుకు హోమియోపతి డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి పనిని అప్పగించాడు.25 కేజీల పేలుడు పదార్థం అమ్మోనీయం నైట్రేట్ 30 డిటోనేటర్లు సమీకరించిన అఫాఖీ.. వాటిని బంగారు రంగులో ఉన్న ట్రాలీ బ్యాగ్లో తీసుకొచ్చి మంగుళూర్లోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఐఎం కార్యకర్త హడ్డీకి అప్పగించినట్లు గత నెల 8న బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు తేల్చారు. కర్టాటకకు భత్కల్ ప్రాంతానికి చెందిన సద్దాం హూస్సేన్, అబ్దుల్ సుబూర్ను రియాజ్ అహ్మద్ సయూదీలను అరెస్టు చేసినప్పుడు ఈ విషయం ఆధారాలతో బయటపడింది.
దిల్ సుఖ్ నగర్ బాంబు ఘటనకు నేటికి రెండేళ్లు




