Wednesday, 4 November 2026

దేశచరిత్రలో నూతన అధ్యాయం

C
– పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం

– డబ్బా ఇళ్లు ఇ ఉండవు

– రెండు పడకగదుల ఇళ్ల ప్రారంభోత్సవసభలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌16(జనంసాక్షి): దేశ చరిత్రలో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణం నూతన అధ్యయనమని ,  తెలంగాణలో పేదలకు ఇకపై డబుల్‌ బెడ్‌రూం ఇళ్లే కట్టిస్తామని, డబ్బా ఇళ్లు కట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గతంలో తాను డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లగురించి ఇచ్చిన హావిూ మేరకు  పేదలు ఆత్మగౌరవంగా బతికేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో రెండు పడక గదుల ఇళ్లను సిఎం  ప్రారంభోత్సవం చేశారు. గతేడాది ఇక్కడ పునాది వేసిన తరవాత ఏడాదిలోగా వీటని నిర్మించడం విశేషం. ఇళ్ల నిర్మాణంతో దేశ చరిత్రతోనే కొత్త అంకానికి తెరతీశామని అన్నారు. గత దసరానాడు ఇక్కడికి వచ్చానని, ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశానని అన్నారు. ఏడాదిలోనే గృహ నిర్మాణం పూర్తి కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. 119 నియోజకవర్గాల్లో 400 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల ఇళ్లు నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పేదలకు ఇళ్లంటే వూరు బయట కట్టాలని భావిస్తారని, తాము నగరం మధ్యలోనే ఇళ్లు కట్టామని పునరుద్ఘాటించారు.  రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకంలో భాగంగా ఇవాళ లబ్దిదారులకు పట్టాల పంపిణీ జరిగింది. మంత్రి తలసాని అధ్యక్షత వహించారు. ఇంకా మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తనకు ఇవాళ సంతోషకరమైన రోజు అన్నారు. పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి వారిని సొంతింటి వారిని చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మొత్తం 396 ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం అధికారులు ఎంపిక చేసిన ఐదుగురికి సీఎం పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఆనందంతో సీఎంకు పాదాభివందనం చేయడం కనిపించింది. వద్దంటూ సీఎం వారిని వారిస్తూ సుతిమెత్తగా పక్కకు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం పోయిన దసరాకు ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని నేటి వరకు పూర్తి చేసుకున్నాం. ఇవాళ విూరంతా కొత్త ఇండ్లలోకి పోతుండటంతో నాకెంతో సంతోషంగా ఉంది. అన్న మాట ప్రకారం పాలు పొంగించి నేనే మిమ్మల్ని ఇండ్లలోకి పంపిస్తున్నానని సిఎం అన్నారు.  అనుకున్న పద్ధతిలో ఇండ్లను నిర్మించుకున్నాం. దేశ చరిత్రలోనే కొత్త అంకానికి తెరతీశామన్నారు.  60 ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వమూ చేయని పని తెలంగాణ ప్రభుత్వం చేసిందని సీఎం అన్నారు. దేశానికే మన ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇళ్లను ప్రారంభించిన అనంతరం కాలనీ ప్రజలతో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి బోజనం చేశారు. గతంలో పేదలకు ఇండ్లు అంటే ఊరవతల కట్టించి ఇచ్చేవారు. కానీ మా ప్రభుత్వం పట్టణాలు,

నగరాల్లోనే ఇండ్లను నిర్మించి ఇస్తుంది. పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కోసం రూ.4 వేల కోట్లు కేటాయించుకున్నాం. ప్రతీ నియోజకవర్గానికి నాలుగు వందల చొప్పున ఇండ్లను నిర్మిస్తాం. గతంలో పేదలకు ఇండ్లు అంటే డబ్బా రూమ్‌లు ఉండేవి కానీ ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. ఇవాళ ఇక్కడ కట్టిన ఇండ్లను వివిధ జిల్లాల కలెక్టర్లు వచ్చి చూసారు. మన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా మెచ్చుకున్నారు. మేం కేంద్ర ప్రభుత్వం తరపున ఒక్క రూమ్‌ ఇండ్లను ఇస్తుంటే విూ సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను ఇస్తున్నారని అన్న విషయం విూకు తెలిసిందే. పేద ప్రజలు విూరంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా. విూతోపాటు ఇవాళ భోజనం చేస్తానని ఆనాడు అన్న. అన్నమాట ప్రకారం ఇవాళ విూతోపాటు సహపంక్తి భోజనం చేస్తున్నా అని తెలిపారు. విూరు నాకు దావతు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

కెసిఆర్‌ మానసపుత్రిక

కెసిఆర్‌ మానస పుత్రిక పేదవారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కళ నెరవేరింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఐడీహెచ్‌ కాలనీలోని నూతన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. కాలనీలో ఏర్పాటు చేసిన వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కాలనీకి చేరుకోగానే వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మహిళలు మేళతాళలతో, మంగళ హారతులు పట్టి ఆహ్వానించారు. ఈ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను 580 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించారు. ఇందులో రెండు టాయిలెట్లు ఒక హాల్‌, వంటగదితో ఒక్కో ప్లాట్‌ను చూడ చక్కగా నిర్మించారు. మొత్తం 396 ఇండ్లను నిర్మించారు. సీఎం మాకు నీడ కల్పించిన దేవుడని లబ్దిదారులు శ్లాఘించారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని లబ్దిదారులు అనుకోవడం కనిపించింది.  సీఎం కేసీఆర్‌ జీవితాశయం నెరవేరింది. రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి ఇళ్లు ఉండాలన్న సంకల్పంతో వేసిన బీజం మొలకెత్తింది. ఇవాళ ఐడీహెచ్‌ కాలనీలో పేదల కోసం నిర్మించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లను సీఎం ప్రారంభం చేశారు. 396 పేద కటుంబాలు సర్వ హంగులతో నిర్మించిన క్తొ ఇళ్లలో కాలు మోపాయి. సీఎం చేతుల విూదుగా ఇళ్ల పట్టాలను లబ్దిదారులు అందుకున్నారు.

పేదల ఆకలి తెలిసిన వ్యక్తి కెసిఆర్‌

పేదలకు ఇండ్లు అంటే గతంలో ఏ ప్రభుత్వాలు ఆలోచించేవికావని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. పేదలకు ఇండ్లు అంటే ఎక్కడో ఊరవతల కట్టించేవారని గుర్తు చేశారు. కానీ మన సీఎం కేసీఆర్‌ అలాంటి వ్యక్తి కాదని తెలిపారు. పేదల ఆకలి తెలిసిన వాడిగా వాళ్లకు ఇండ్లు లేక కష్టపడుతున్న విషయాన్ని గుర్తించారు. అందుకే రాష్ట్రంలోని ప్రతీ పేదవానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించాలని సంకల్పం తీసుకున్నారని వివరించారు. ఇవాళ 396 ఇండ్లను నిర్మించుకుని ఐడీహెచ్‌ కాలనీలో ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇలాంటివెన్నో ఇంకా రాష్ట్రమంతటా పేదల కోసం నిర్మించుకుందామని తెలిపారు. ఇందు కోసం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందన్నారు. సీఎం కేసీఆర్‌ 16 నెలల ప్రభుత్వ కాలంలో సుమారు 36 వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసమే ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. సీఎం మాట ఇస్తే తప్పరు, అందుకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ల ఇండ్ల నిర్మాణమే నిదర్శనమని వివరించారు. ఇక్కడకు వచ్చి ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించారు. పేదల కోసం ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారని

తెలిపారు. హైదరాబాద్‌ను స్లమ్‌లెస్‌ సిటీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

పేదలకు ఇవాళ దీపావళి: దత్తాత్రేయ

సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాట నిలబెట్టుకునే రకమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఐడీహెచ్‌ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం చారిత్రత్మాకమని అభివర్ణించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణ పథకాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఐడీహెచ్‌ కాలనీలో ఇవాళ దీపావళి పండుగ అని కొనియాడారు. దసరా,దీపావళి వెళ్లిపోయినా ఇక్కడి పేదలకరు ఇవాళే నిజమైన దీపావళి అన్నారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దాలని సీఎం పెట్టుకున్న లక్ష్యం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌ స్లమ్‌లెస్‌ సిటీగా కావాలని ఆకాంక్షించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎంకు అభినందనలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టిందని కొనియాడారు. కొత్త రాష్ట్రంలో అన్ని మంచి పనులే జరుపుకుందామని పిలుపునిచ్చారు. సిద్దిపేట, వరగంల్‌, హైదరాబద్‌, రామగుండం పట్టణాలను స్లమ్‌లెస్‌ సిటీలుగా మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. అలాగే కార్మిక శాఖ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *