హైదరాబాద్, డిసెంబర్ 5 (జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. హస్తినలో ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమస్యలను కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ప్రధానిని సీఎం కేసీఆర్ కలుస్తారు : వేణుగోపాలాచారి
తన హస్తిన పర్యటనలో భాగంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్రమోదీని కలుస్తారని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి వెల్లడించారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరనున్నారు. ఆయన నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులు ఉమాభారతి, రవిశంకర్ అయ్యర్‌లను కలువనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన జలవివాదాలు, హైకోర్టు విభజన తదితర అంశాలపై సీఎం చర్చించనున్నట్టు వెల్లడించారు. 9న తిరిగి ఆయన హైదరాబాద్‌కు వెళ్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై కెసిఆర్ ప్రధానితో చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎపికి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరనున్నట్లు.. ఈ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.





