ధోనిని అరెస్టు చేయండి..

1భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి అనంతపురం కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. 2013లో బిజినెస్‌టుడే మ్యాగజైన్‌లో విష్ణుమూర్తి అవతారంలో ధోనీ… పాదరక్షలను చేతిలో పట్టుకున్నట్లు చిత్రం ముద్రించారు. దీనిపై అప్పట్లో విశ్వహిందూపరిషత్‌ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌ అనంతపురం జిల్లా కోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్‌పై గత కొంతకాలంగా విచారణ కొనసాగుతూ వచ్చింది. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ధోనీతో పాటు, బిజినెస్‌ టుడే ఎడిటర్‌ చైతన్యకాల్‌బాగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే చైతన్యకాల్‌బాగ్‌కు సమన్లు చేరలేదు. ధోనీ మాత్రం సమన్లు తీసుకున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరుకాకపోగా, కనీసం న్యాయవాది ద్వారా కౌంటరు కూడా దాఖలు చేయలేదు. దీంతో అనంతపురం జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తీవ్రంగా పరిగణించి ధోనీకి నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేసింది. వచ్చేనెల 25న ధోనీ హాజరుకావాలని లేకపోతే అరెస్టు చేసి హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.