Monday, 2 November 2026

నల్లధనంపై కేంద్రం దండోరా

Untitled-3

ఖాతాలో నుంచి జారుకుంటున్న బ్లాక్‌మనీ

బేనామీ ఖాతాలోకి నల్లకుబేరుల ధనం

చర్యలు మొదలయ్యేసరికి రూపాయి మిగలదు

ఇందిరా హయాంలో భూసంస్కరణల చట్టానిది ఇదే తీరు

‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం

‘అంగట్లో అన్నీ ఉన్నాయి.. కానీ.. అల్లుని నోట్లో శని ఉంది. భారతదేశం భాగ్యసీమ.. సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుంది’ అని ఓ విప్లవ కవి ప్రశ్నించినట్లుగానే అపారమైన దేశ సంపద నల్లధనం రూపంలో విదేశీ ఖాతాలకు తరలిపోయింది. నల్లధనంపై ప్రభుత్వాలది మొద్దునిద్ర. ఎందుకంటే.. ఆ ప్రభుత్వాలను వెనకా.. ముందు నుంచి నడుపుతున్నది వాళ్లే కనక. తన కంటిని తాను పొడుచుకోడన్నట్లుగా పాలకులు కట్టుకున్న అద్దాలమేడకు నిప్పుపెట్టుకోరు. ఫలితంగా నల్లకుబేరులు హాయిగా నిద్రపోతున్నారు. దేశంలో పార్లమెంటరీ వ్వవస్థ విఫలమైనప్పుడల్లా.. అనివార్యంగా న్యాయస్థానాలు కలుగజేసుకోక తప్పలేదు. ఇప్పుడు నల్లధనం నిగ్గుతేల్చడంలో కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం మేరకు సుప్రీం కోర్టు నల్లధనంపై జస్టిస్‌ షా నేతృత్వంలో సిట్‌ వేసింది. ఆ వివరాలను పరిశీలిద్దాం..

 

హైదరాబాద్‌, నవంబర్‌17, (జనంసాక్షి) : దేశంలో అవినీతి ధాటికి అభివృద్ధి కుంటుపడింది. అవినీతి పరుల సంఖ్య 84 వేలు దాటింది. విదేశీ బ్యాంకుల్లో భారతీయ నల్లకుబేరుల సొమ్ము రూ.70 లక్షల కోట్లకు పైచిలుకు చేరింది. ఈ నేపథ్యంలో.. విదేశాల్లో పోగుబడిన నల్లధనాన్ని దేశానికి రప్పించి దేశ ఆర్థిక దరిద్య్రాన్ని వదలగొడతానని ఎన్నికల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ పలికిన పలుకులివి. కానీ.. అధికారంలోకి రాగానే మాట మార్చారు. దీంతో ప్రజల ఆగ్రహానికి మోడీ మళ్లీ తొలిపల్లవి అందుకున్నారు. నల్లధనం తాలూకు సొమ్మును పైసా వదలకుండా దేశానికి రప్పిస్తానని ఇప్పుడు దేశ, విదేశాల్లో దండోరా వేస్తున్నారు. అదేసందర్భంలో.. ఈ విషయమై అంతులేని తాత్సారం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన నల్లకుబేరులు తమ ఖాతాల్లోని సొమ్మును కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. విదేశాల్లో ఉన్న తమ ఖాతాలను క్రమంగా ఖాళీ చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ నల్లధనం దేశానికి వస్తుందా..? లేదా..? అసలు మోడీ మాటలు నమ్మాలా..? వద్దా..? అనే ప్రశ్నలు అనేకం వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు.. గతంలో ఇందిరాగాంధీ హయాంలో.. ఎమర్జెన్సీ కాలంలో భూసంస్కరణల చట్టం అమలు చేసే సమయానికి అసలు మిగులుభూములే లేకుండా చేసిన సంఘటనను పరిశీలిస్తే సమాధానం దొరుకుతుంది.

నల్లధనంపై నమ్మబలుకుతున్న మోడీ…

దేశంలో నల్లధనం నిగ్గుతేల్చేందుకు ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం మేరకు సుప్రీంకోర్టు జస్టిస్‌ షా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సిట్‌ నేతృత్వంలో నల్లధనంపై దర్యాప్తు మొదలెట్టింది. కానీ.. ఎన్నికల్లో మోడీ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే నల్లధనం నిగ్గుతేల్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు సిట్‌ను ఏర్పాటు చేశామని నమ్మబలుకుతున్నారు. దేశంలో ఉన్న అవినీతి పరుల బండారాన్ని బయటపెట్టేందుకు సుప్రీంకోర్టు, సిట్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా.. నల్లధనం పోగేసుకున్న వారి వివరాలను, వారి పేర్లను సమర్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే… నల్లకుబేరుల పేర్లను వెల్లడించలేమని నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రకటించింది మోడీ ప్రభుత్వం. దీంతో ప్రజల్లో, వివిధ రాజకీయ వర్గాల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెంటనే తడుముకుని.. నల్లధనం రాబట్టడంలో పైసా వదలనని నమ్మబలుకుతోంది. అంతేకాదు.. నిన్నటి వరకు ఆస్ట్రేలియాలో జరిగిన జి-20 దేశాల సదస్సులోనూ ప్రధాని మోడీ నల్లధనంపై ప్రస్తావించారు. నల్లధనం వెలికితీతకు ప్రపంచదేశాలు తమకు సహకరించాలని కోరారు. ఈ విధంగా మోడీ నల్లధనం వెలికితీతలో తీవ్ర తాత్సారం చేస్తున్నారని, నల్లకుబేరులకు అండగా నిలిచేందుకే మోడీ రాజకీయ నాటకం ఆడుతున్నారని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అసలు నల్లధనం రప్పించడంలో మోడీ పాత్ర ఏమీ లేదని, అంతా సుప్రీంకోర్టు, సిట్‌ మాత్రమే చూసుకుంటుందన్న విషయాన్ని గుర్తించాలి.

1975లో భూసంస్కరణల చట్టం మంచి ఉదాహరణ…

ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1975లో దేశంలో భూసంస్కరణల చట్టాన్ని అమలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి వచ్చింది. ఆ సమయానికి దేశంలో 40 వేల కోట్ల ఎకరాల మిగులు భూమి ఉండాలి. కానీ.. భూసంస్కరణ చట్టం అమలు చేసేందుకు అంతులేని ఆలస్యం చేయడంతో.. ఈ కాలంలో మిగులు భూములన్నింటినీ పెద్ద పెద్ద భూస్వాములు, పెత్తందారులు తమ పిల్లలు, జంతువుల పేర్లమీద కాజేసి కోటికి ఎకరం భూమి కూడా మిగలకుండా లెక్కలు చూపించారు. దీంతో భూసంస్కరణలు చేసేందుకు మిగులు భూములే లేకుండా చేశారు. తద్వారా భూసంస్కరణల చట్టం నీరుగారిపోయింది. ఇప్పుడు నల్లధనం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోంది. ఎన్నికలప్పుడు నల్లధనం వెనక్కి రప్పిస్తామని, ఆ తర్వాత అది సాధ్యం కాదని, తిరిగి మళ్లీ పైసాలేకుండా నల్లధనం రప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం నానా రకాలుగా ప్రజలను మభ్యపెడుతోంది. తద్వారా అవినీతి పరులు దాచుకున్న సొమ్మును వారి ఖాతాల్లోంచి తమ పిల్లలు, కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించేందుకు తగినంత సమయం ఇస్తోందని విశ్వసనీయ సమాచారం. దీనివల్ల నల్లధనంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందించే వరకు ఆయా బ్యాంకుల్లో ఉన్న నల్లకుబేరుల ఖాతాల్లో రూపాయి కూడా మిగలదని, ఖాతాలు ఖాళీ అయ్యాక ప్రభుత్వం చేసేదేముందని పైన పేర్కొన్న భూసంస్కరణల చట్టం హెచ్చరిస్తోంది. అందుకని కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని దేశానికి రప్పించే చర్యలను తక్షణమే వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయి. దానికోసం ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడాలని, ఇచ్చిన మాట ప్రకారం విదేశాల్లో పోగుబడిన నల్లధనాన్ని దేశానికి రప్పించి దేశ ఆర్థిక ప్రగతిని మెరుగుపర్చాలని, ఈ చర్యలతో భవిష్యత్‌లో ఇంకెవ్వరూ అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు మార్గదర్శకం కావాలని, అలాంటి వారికి ఇదొక హెచ్చరిక కావాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *