రాష్ట్ర జంతువుగా జింక, పక్షిగా పాలపిట్ట
వృక్షంగా జమ్మిచెట్టు, పుష్పంగా తంగేడు
సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 17 (జనంసాక్షి) : పాత చిహ్నాలన్నీ ఆంధ్రోళ్ళ సంస్కృతివేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అధికారిక చిహ్నాలను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్)ను ప్రభుత్వం ఎంపిక చేసింది. అలాగే, రాష్ట్ర పుష్పంగా తంగేడు, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్టాన్రికి అధికారిక చిహ్నాలపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారిక చిహ్నాల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం అధికారిక చిహ్నాలు ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలకు అద్దంపట్టేలా ఉండాలసి సీఎం అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర చిహ్నాలను ఆంధ్ర కోణం నుంచి ఎంపిక చేశారని చెప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడి అధికార చిహ్నాలు కూడా తెలంగాణ కోణం నుంచి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇందులో పలు రకాల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని సునిశితంగా పరిశీలించిన సీఎం చరిత్ర, పౌరాణిక నేపథ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. జింకకు భారతదేశ చరిత్రతో సంబంధం ఉందని, రామాయణం లాంటి గాథలలో కూడా జింకకు ప్రముఖ స్థానం ఉందని అన్నారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా జింకలు ఉన్నాయని, చిన్నపీటి అడువుల్లో కూడా జింక మనుగడ సాగిస్తున్నదని వెల్లడించారు. అడవి జంతువుల్లో అత్యంత సున్నితమైనదిగా, అమాయకమైనదిగా జింకు పేరున్నదని చెప్పారు. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా జింక ఉంటుందని అన్నారు. పాలపిట్టకు కూడా తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పారు. ప్రతి సంవత్సరం దసరా రోజు పాలపిట్టను దర్శించుకోవడం శుభసూచకంగా కూడా ప్రజలు భావిస్తారన్నారు. లంకా నగరం మీదకి దండయాత్ర చేసేముందు రాముడు పాలపిట్టను దర్శించుకున్నారని, అందుకే అతడికి విజయం వరించిందని పౌరాణిగాథలు తెలుపుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా విజయపథంలో నడవడానికి శుభసూచకంగా పాలపిట్టను రాష్ట్ర అధికారిక పక్షిగా ఎంపిక చేసినట్లు వెల్లడిచారు.
జమ్మిచెట్టు కూడా తెలంగాణ ప్రజా జీవితంలో అంతర్బాగమేనని వెల్లడించారు. పాండవులు అజ్ఞాత వాసం చేసే సందర్భంలో ఆయుధాలను జమ్మిచెట్టుపైనే భద్రపరిచారని పురాణగాథలు చెబుతున్నాయన్నారు. జమ్మిచెట్టుకు పూజలు చేసి అక్కడి నుంచి ఆయుధాలు తీసుకెళ్ళి తరువాత యుద్ధం చేశారని, ఆ యుద్ధంలో పాండవులు విజయం సాధించారన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న కౌర సేనను ఓడించడంలో తక్కువ సంఖ్యలో ఉన్న పాండవులకు జమ్మిచెట్టు నుంచి శకి, ఆశీర్వాదం లభించిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా జమ్మిచెట్టు ఆశీర్వాదం కావాలని అన్నారు. దసరా పండుగ సందర్భంగా కూడా తెలంగాణ ప్రజలు జమ్మిచెట్టుకు పూజలు చేసి జమ్మి ఆకును వెంట పెట్టుకోవడం ఆనవాయితీ అని సీఎం అన&ఆనరు. ఇలాంటి జమ్మిచెట్టును రాష్ట్ర అధికారిక చిహ్నంగా పెట్టుకోవడం తెలంగాణకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మేలు జరుగుతుందని జమ్మి చెట్టును, సౌభాగ్యాన్ని కాపాడే విశిష్టత తంగేడు పువ్వుకు ఉంటుందని తెలంగాణ ఆడపడుచులు భావిస్తున్నందునే రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ఎంపిక చేశామని వివరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, అధికారిక చిహ్నాల ఖరారుపై తెలంగాణ వాదుల్లో హర్షం వ్యక్తమైంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రాష్ట్ర అధికారిక చిహ్నాలను ఎంపిక చేశారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంచి చిహ్నాలను ఎంపిక చేసినందుకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.





