ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జూలై, ఆగస్టు మాసాల్లో వర్షపాతం అనుకున్న విధంగా లేకపోయినప్పటికీ సెప్టెంబర్ లో మంచి వర్షాలు పడుతున్నాయని సీఎం చెప్పారు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. అధికారి నివాసంలో వ్యవసాయం, వర్షాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆరా తీశారు. మహబూబ్ నగర్ జిల్లా మిగతా అన్ని జిల్లాలో మంచి వర్షాలు పడుతుండటం శుభ సూచకమని సీఎం అన్నారు. రాష్ట్రం తీవ్ర కరువు బారి నుంచి బయటపడ్డట్టేనని, రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మంచి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వర్షాల వల్ల చాలా జిల్లాల్లో చెరువులు నిండి, భూగర్భ జలాలు కూడా పెరిగాయని వివరించారు. దీని ఫలితంగా రబీ సీజన్ కు సాగునీటి ఢోకా ఉండదన్నారు. ఏదేమైనా అధికారులు మండలాల వారీగా సర్వేలు జరిపి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సీఎం ఆదేశించారు. నష్టం జరిగిన రైతులకు సాయం చేసే విషయంలో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.
నష్టపోయిన రైతులకు అండగాఉంటాం




