Monday, 2 November 2026

నిజాంసాగర్‌ ద్వారా మళ్లీ 3 లక్షల ఎకరాలకు నీరందించాలి

C

– సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,నవంబర్‌29(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లాలోని నిజాంసాగర్‌  ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరందించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు.ఆదివారం ఆయన నిజామాబాద్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ పథకాలపై సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాల్వలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. నిజాంసాగర్‌ ద్వారా గతంలో జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. మళ్లీ ఇప్పుడు కూడా మూడు లక్షల ఎకరాల భూమికి నీరందేలా కాల్వలను పటిష్టపరచాలని ఆయన అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాకు కూడా గరిష్టంగా లాభం జరుగుతోందని,  మల్లన్న సాగర్‌ నుంచి నీరు తీసుకోవడానికి అనుగుణంగా రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణం జరగాలని ఆయన తెలిపారు. అంతరాష్ట్ర ప్రాజెక్టు లెండి ద్వారా కూడా జుక్కల్‌ నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని,కావున  లెండి ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయాలని, బాల్కొండ, ఆర్మూర్‌ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు నీరందించేందుకు ప్రగతిలో ఉన్న పనులను యథావిధిగా కొనసాగించాలి ఆయన అన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా ఎక్కువ చెరువులను తీసుకుని పునరుద్ధరించాలి. జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నందున చాలా చెరువుల్లో నీరు లేదు. ఈ స్థితిని సానుకూలంగా తీసుకుని చెరువుల పనులు మొదలు పెట్టాలి. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించే విషయంలో కూడా జిల్లాలో ఎక్కువ పురోగతి కనిపించాలని ఆయన తెలిపారు. సాధారణ కోటాకన్నా జిల్లాకు అవసరమైతే రెండు వేల ఇండ్లు అదనంగా కేటాయిస్తామన్నారు. గృహకల్ప ద్వారా గతంలో కట్టిన ఇండ్లలో చాలా తక్కువ సంఖ్యలో నివాసం ఉంటున్నారు. వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన విధానం రూపొందించాలి. గృహ నిర్మాణంలో అవినీతి నిరోధించాలి. అసలైన పేదలను లాటరీ పద్దతి ద్వారా అధికారులు ఎంపిక చేయాలని, మహిళల పేరువిూదనే ఇండ్ల కేటాయింపు ఉండాలని సూచించారు. రైతులకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌ అందించడానికి వీలుగా కొత్త సబ్‌స్టేషన్‌ల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని, కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల నిర్మాణానికి అనువుగా స్థలాలను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *