Tuesday, 3 November 2026

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం

C

– వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం

– మంత్రి కేటీఆర్‌

వరంగల్‌,ఫిబ్రవరి 19(జనంసాక్షి): వరంగల్‌ను ఐటి హబ్‌గా తీర్చిదిద్ది ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని  తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ నగరంతో పాటు వరంగల్‌కు ప్రముఖ ఐటీ కంపెనీలను తీసుకోస్తామని అన్నారు. మడికొండలోని ఐటీ సెజ్‌లో ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కు శంకుస్థాపన, ఐటీ ఇంక్యుబేషన్‌ టవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగిస్తూ.. ‘ఈ రోజు వరంగల్‌ చరిత్రలో మలుపు తిరిగిన రోజు. జిల్లాపై సీఎం కేసీఆర్‌కు అపారమైన ప్రేమ ఉంది. రాబోయే కాలంలో వరంగల్‌ను ఐటీహబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు.  ఐటీ ఉద్యోగాల కోసం ఇకపై ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌కు సవిూపంలో వరంగల్‌ లాంటి మహా నగరం ఉండటం మన అదృష్టం అన్నారు. రాబోయే 18 నెలల్లో వెయ్యి మందికి వరంగల్‌లో ఉపాధి లభిస్తుంది. ఒక్క హైదరాబాద్‌లోనే సెయింట్‌ సంస్థ 7 వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. ఐటీ పార్క్‌ అభివృద్ధి కోసం వెంటనే రూ. 5 కోట్లు విడుదల చేస్తాం. త్వరలోనే ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను పూర్తి చేస్తాం. వరంగల్‌లోని విద్యాసంస్థలను ఒకే చోటకు తీసుకొస్తాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ కోసం శిక్షణ ఇస్తామని ప్రకటించారు. అలాగే విదేశాలకు వెళ్లే వారికి కూడా శిక్షణ ఇస్తామని అన్నారు. ఇకనుంచి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఇక్డే ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఫిబ్రవరి 19 వరంగల్‌ చరిత్రలో గొప్ప రోజు కానుందన్నారు. ఈ రోజును వరంగల్‌ విద్యార్థులు మరిచిపోవద్దు. వరంగల్‌కు ఐటీ కంపెనీ అడుగుపెట్టిన రోజు ఫిబ్రవరి 19. దేశ వ్యాప్తంగా ఐటీ వృద్ధి 13 శాతం ఉంటే.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 16 శాతం వృద్ధి ఉంది. రాబోయే కాలంలో వరంగల్‌ జిల్లాను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని’ స్పష్టం చేశారు.గత పాలకులు వరంగల్‌ను నిర్లక్ష్యం చేశారని అన్నారు. తాము కోరిన వెంటనే నాస్కామ్‌ ఛైర్మన్‌గా ఉన్న మోహన్‌ రెడ్డి ఇక్కడ ఐటి కేంద్రాన్ని ప్రారంబించడం పట్ల మంత్రి కెటిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. మైసూరు, పునా నగరాల మాదిరి వరంగల్‌ను ఐటి కేంద్రంగా అభివృద్ది చేస్తామని అన్నారు. ఇప్పటికే అభివృద్దితో హైదరాబాద్‌ నగరం విస్తరించి ఉన్నందున వరంగల్‌ను ఐటి రంగంలో అభివృద్ది చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. ఇక్కడ అన్ని రకాల భూవసతులు ఉన్నాయని, వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కొత్త కంపెనీలకు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఐటీ హబ్‌, టెక్స్‌టైల్‌ పార్క్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కంపెనీలతో వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ తో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అధికారులు ఉన్నారు. ఈ టవర్లను వరంగల్‌, హైదరాబాద్‌ 163వ జాతీయ రహదారిపై మడికొండ సెజ్‌లో రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ సెజ్‌లోనే ఐదెకరాల్లో సీయెంట్‌ కంపెనీ స్థాపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *