హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ మరింత వేగవంతం చేస్తోంది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న 50 లక్షల రూపాయలపై దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. తాజాగా వ్యాపారవేత్త డీకే శ్రీనివాస్‌నాయుడిని ఏసీబీ విచారించింది. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కలవడంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు జారీ అవుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొంతమంది రాజ్యసభ సభ్యులు డబ్బులు సమకూర్చారని వార్తలు వచ్చినా తాజాగా మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు కుమారుడు,.. కర్నాటక బేవరేజస్ ఎండీ శ్రీనివాస్‌నాయుడును ఏసీబీ అధికారులు దాదాపు 6 గంటలపాటు విచారించారు.
రేవంత్‌రెడ్డి మంచి స్నేహితుడు..
రేవంత్‌రెడ్డి డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బంది నుంచి సేకరించిన సమాచారం మేరకు శ్రీనివాస్‌నాయుడిని ఏసీబీ విచారించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన 50 లక్షల రూపాయలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే శ్రీనివాస్‌నాయుడు మాత్రం తనకు రేవంత్‌రెడ్డి మంచి స్నేహితుడు మాత్రమేనని.. తన కార్యాలయం నుంచి ఎవరికీ డబ్బులు సమకూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. తన కార్యాలయంలో పని చేస్తున్న విష్ణుచైతన్య మరో రెండు రోజుల్లో ఏసీబీ విచారణకు హాజరవుతారని తెలిపారు.
కేసీఆర్‌తో ఏకే ఖాన్ భేటీ..
ఇక ఈ నగదు వ్యవహారంపై మరిన్ని సాక్ష్యాధారాలు లభిస్తే మరికొంతమందిని విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఈ విషయాలపై బుధవారం నాడు మరింత స్పష్టత వచ్చేటట్లు తెలుస్తోంది. మరోపక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కలవడం ఉత్కంఠ రేపుతోంది. మత్తయ్యను ఆంధ్రప్రదేశ్‌కు పంపించిన పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చే అంశంపై కేసీఆర్, ఏకే ఖాన్‌లు చర్చించినట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు దర్యాప్తు తీరు… చార్జిషీట్‌లోని పలు అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి..? విచారణకు హాజరుకాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలు కూడా కేసీఆర్ వద్ద ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్ని చూస్తుంటే త్వరలోనే మరికొంత మందికి నోటీసులు జారీ అయ్యేటట్లు కనిపిస్తోంది.




