నేటి నుంచి స్వచ్ఛ హైదరాబాద్‌

3

మహా యజ్ఞం ప్రారంభం
హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభం కానుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ఉన్నతాధికారులందరూ పాల్గొననున్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్‌, రెవెన్యూ, పోలీసులు, కార్పొరేషన్‌ శానిటేషన్‌ సిబ్బంది ఇలా మొత్తం 35వేల మందిదాకా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మొత్తం 5రోజుల పాటు స్వచ్ఛ హైదరాబాద్‌..

ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కేవలం 5రోజులకే పరిమితం కాదని, ప్రతి నెలలో ఒక రోజు కొనసాగుతుందన్నారు. అంతర్జాతీయస్థాయి నగరమైన హైదరాబాద్‌ను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మార్చేందుకు స్వచ్ఛభారత్‌లో భాగంగా హరితహారం కార్యక్రమం తీసుకుంటామని సీఎం చెప్పారు.

425 విభాగాలు…

స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో గ్రేటర్‌ను మొత్తం 425 విభాగాలుగా విభజించారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో అధికారులు, మంత్రులంతా కలిసి 50వేల మెట్రిక్‌టన్నుల చెత్తను ఏరివేయడం, శిథిలాలను తొలగించడం, బస్తీని పరిశుభ్రంగా మార్చడం వంటి పనులు చేస్తారు. వీటితో పాటు విద్యుత్‌, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, కూరగాయల మార్కెట్లు, శ్మశానవాటికలు, పార్కుల వంటి మౌలిక సదుపాయాల పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరు, ఆయా బస్తీల్లో ఇళ్లు లేని పేదల వివరాలు, తక్షణం అక్కడ ఎలాంటి పనులు చేపట్టాలనే విషయాలపై సమాచారం సేకరించాలని సీఎం సూచించారు.

కూరగాయల మార్కెట్లు, శ్మశానవాటికలు, పార్కుల అభివృద్ధి..

అప్పటికప్పుడు చేయగలిగిన పనులు ఉంటే వెంటనే పూర్తి చేయడానికి బస్తీకి వెళ్లే ప్రతి అధికారికి 50 లక్షల రూపాయల వరకు పనులు చేపట్టే అవకాశం కల్పించామన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులు, దృష్టికి వచ్చిన సమస్యలపై ఈ నెల 26న మరోసారి నగర ప్రజాప్రతినిధులతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇక స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా ఆనంద్‌నగర్‌ ప్రాంతానికి గవర్నర్‌ నరసింహన్‌ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తుండగా సికింద్రాబాద్‌లోని పార్శీగుట్టకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్యాట్రన్‌గా వ్యవహరించనున్నారు.