Monday, 2 November 2026

నేడే గ్రేటర్‌ వార్‌

C
– సర్వం సిద్ధం

హైదరాబాద్‌,ఫిబ్రవరి 1(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 50వేల సిబ్బంది ఎన్నికలను పర్యవేక్షిస్తారు. మంగళవారం ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్లకు గానూ 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వివిధ పార్టీలు పోటీలో ఉండగా ఆదివారం సాయంత్రానికి ప్రచారం ముగియడంతో అభ్యర్థులు,వారి అనుయాయులు ఇంటింటి ప్రచారంలో మునిగిపోయారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు కమిషన్‌ జనార్దన్‌ రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. అభ్యర్థుల  భవితవ్యాన్ని 74,23,980 మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 39,69,007 మంది పురుషులు, 34,53,910 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. 1,333 మంది అభ్యర్థుల భవితవ్యం ఫిబ్రవరి 5న తేలనుంది. 5న ఉదయం కౌంటింగ్‌24 కేంద్రాలలో ఈవీఎంల పంపిణీ చేపట్టారు. . ఈవీఎంల పంపిణీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకుంది. సాయంత్రం వరకు పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది చేరుకున్నారు.  గ్రేటర్‌ వ్యాప్తంగా 7,802 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్‌కు 46,545 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 7,760 మంది రిజర్వ్‌ పోలింగ్‌ సిబ్బంది, 1500 మైక్రో అబ్జర్వర్లను అధికారులు నియమించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఐదుగురు ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు

పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఎన్నికల కోసం మొత్తం 7802 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ఎన్నికల నిర్వహణకు 46,545 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి కేంద్రంలో ఒక పీవో, ఏపీవోతోపాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. 12వేల ఈవీఎంలు అందుబాటులో ఉంచారు. నగరంలో మంగళవారం సెలవు ప్రకటించారు. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించారు. ఇప్పటికే ఓటరు చీటీల పంపిణీ 80 శాతం పూర్తి చేశారు. దీంతోపాటు తమ పోలింగ్‌ కేంద్రం ఎక్కడో ఓటర్లు సులభంగా తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉంచారు.  సోమవారం ఉదయం ఇవిఎలంను  24 పంపిణీ కేంద్రాల వద్ద అధికారులకు అందజేశారు. ఈవీఎంలతోపాటు ఇతర సామగ్రినీ ఆయా కేంద్రాలకు తరలించారు. నగరంలో సుమారు 3200 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ పటిష్టమైన పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయడంతోపాటు 3వేల కేంద్రాల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులతో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తారు. 1500 మందిని సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు.అంధులు సైతం ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని పలు పంపిణీ/కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఓటరు చీటీలు ఎవరికైనా రానట్లయితే తమ ప్రాంతంలోని వార్డు కార్యాలయాల్లో తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్దా వీటిని పంపిణీ చేస్తామని నగర కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి  వెల్లడించారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా 5 లక్షల మంది విద్యార్థుల ద్వారా వారి తల్లితండ్రులకు సంకల్ప పత్రాలను అందజేశామని పేర్కొన్నారు. ఎన్నిక రోజున సినిమా హాళ్లు, ¬టళ్లను మూసి వేసే అంశంపై కార్మికశాఖతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని కమిషనర్‌ చెప్పారు. ఈ ఎన్నికల్లో నోటా ఉండదని స్పష్టం చేశారు. కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు తొలగించారు.

ఓటేయడం బాధ్యత కావాలి : భన్వర్‌లాల్‌ పిలుపు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటుహక్కుని వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ సూచించారు. ఓటు వేయడం అన్నది బాధ్తయగా గుర్తించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటును తమ కర్తవ్యంగా చూడాలన్నారు.  నీతిమంతంగా ఓటేస్తేనే అవినీతి రహిత పాలనకు అవకాశం ఉంటుందని అన్నారు.  ఎన్నికలను పిక్నిక్‌గా, టైం పాస్‌ కార్యక్రమంగా భావించవద్దని, ఓటే భవిష్యత్‌ను నిర్దేశిస్తుందన్నారు. గ్రేటర్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. గ్రేటర్‌లో చదువుకున్న వాళ్లు ఎక్కువే  అయినా.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపరు. ఇందుకు 2002, 2009లో పోలింగే నిదర్శనం. 2002లో 26, అలాగే 2009లో 42 శాతం ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ అంశం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్ని కంగారు పెడుతోంది. పైగా ఈసారి పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మంది మొదటిసారి బరిలో దిగారు. ప్రస్తుతం ఓటర్లను బూత్‌ల వైపు ఎలా నడిపించాలనే అంశంపై అధికారులు శ్రద్ద పెట్టారు.  ఓటర్లపై ప్రభావం చూపే సంఘాల పెద్దలు, అపార్ట్‌మెంటు, కాలనీ సంఘాలతో సమావేశమై అందరూ కచ్చితంగా పోలింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 74 లక్షల మంది ఓటర్లుండగా.. అందులో 20 నుంచి 29 వయసుగల ఓటర్ల సంఖ్య 12 లక్షల పైచిలుకు. వీరందరినీ పోలింగ్‌ బూత్‌కు రప్పించేందుకు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఇకసపోతే  జీహెచ్‌ఎంసీ ఎన్నికల క్షేత్రంలో వివిధ పార్టీల తరపున పోటీచేస్తున్న అభ్యర్థులు కొద్దిరోజులుగా చేస్తున్న ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. ప్రచార అంకంలో చివరిరోజు ఉదయం నుంచే డివిజన్లలో టిఆర్‌ఎస్‌,టిడిపి,బిజెపి, కాంగ్రెస్‌, వన్‌ హైదరాబాద్‌ కూటమి, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల పాదయాత్రలు, వాహనర్యాలీలు సందడిగా సాగాయి. పార్టీల జెండాలు రెపరెపలాడాయి. కార్యకర్తల ఉత్సాహం ఇనుమడించింది. మరోవైపు ఇంటింటికీ వెళ్లి ఓటేయమంటూ అభ్యర్థించారు. ప్రధాన పార్టీల నేతలు అభ్యర్థులతో కలిసి రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొన్నారు.

భారీగా బందోబస్తు ఏర్పాటు

గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేసేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. భారీగా పోలీస్‌ దళాలలను రంగంలోకి దింపింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పక్కాగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు 63 డివిజన్ల పరిధుల్లో ప్రత్యేక పోలీస్‌ బృందాలను నియమించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అదుపులో ఉంచేందుకు ఈ బృందాల పర్యవేక్షణ ఆయా జోనల్‌ డీసీపీలకు అప్పగించారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం సాయంత్రం పోలింగ్‌ పూర్తయ్యేంత వరకూ పైలెటింగ్‌ పోలీస్‌ కొనసాగనుంది.సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను ఎంపిక చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా..పాతబస్తీ, పశ్చిమండలం పరిధుల్లో ప్రచారంలో ఘర్షణలు తలెత్తడం, కొన్నిచోట్ల పరస్పరం దాడులు చేసుకోవడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి ఆయా ప్రాంతాల్లో పైలెటింగ్‌ పోలీసింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.  సాయుధ బలగాలను కూడా అత్యధికంగా ఈ రెండు ప్రాంతాల్లోనే వినియోగించనున్నారు. చార్మినార్‌, బహదూర్‌పుర, గోషామహల్‌, కార్వాన్‌, నాంపల్లి నియోజకవర్గాల్లోనే నాలుగు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బృందాలు, 40 ప్లటూన్ల ప్రత్యేక పోలీసులను నియమించారు. పాతబస్తీలో కొన్ని ప్రాంతాల్లో వాటర్‌ కెనాన్లను కూడా సిద్ధంగా ఉంచారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్‌, బోరబండ, వెంకటేశ్వరకాలనీ, అవిూర్‌పేట డివిజన్ల పరిధుల్లో ప్రతి అరగంటకోమారు పోలింగ్‌ పక్రియపై పోలీస్‌ ఉన్నతాధికారులు సవిూక్షించాలని నిర్ణయించారు. పోలింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144సెక్షన్‌ విధించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని తీర్మానించారు. పాతబస్తీ, పశ్చిమండలం పరిధుల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న 38 డివిజన్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పైలెట్‌ పోలీసింగ్‌తో పాటు పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్‌ను కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్‌ పరిధిలో ఎన్నికల సంఘం 3200 పోలింగ్‌ బూత్‌లలో ల్యాప్‌ట్యాప్‌లకు వెబ్‌ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటర్‌నెట్‌  ద్వారా ప్రతీక్షణం ఓటింగ్‌ సరళిని పరీక్షించనున్నారు. వెబ్‌ కాస్టింగ్‌ను పోలీసులు కూడా పరిశీలించి అనుమానం ఉన్నచోట్ల వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకురానున్నారు. జంగంమెట్‌, పురానాపూల్‌, ఉప్పుగూడ, శాలిబండ డివిజన్ల పరిధుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దక్షిణ మండలం పోలీసులు రాత్రివేళల్లో గస్తీ పెంచారు. బేగంపేట, అవిూర్‌పేట, బోరబండ, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్‌, బంజారాహిల్స్‌, ఆసిఫ్‌నగర్‌, మంగళ్‌హాట్‌, గోషామహల్‌ డివిజన్లలో ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉండడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. కొన్ని డివిజన్ల పరిధుల్లో ఓటర్లకు డబ్బులు పంచడం, బహుమతులు ఇవ్వడం వంటివాటిని ప్రత్యర్థులు గుర్తించి అడ్డుకోవడం, పోలీసులకు సమాచారం ఇస్తుండడంతో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *