ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. కానీ సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో పేదలకు అందకుండా కొందరు అవినీతి అధికారులు అడ్డుపడుతున్నరు. అందుకే సంక్షేమ పథకాల్లో పారదర్శకత పెంచేందుకు సర్కార్ నడుం బిగించింది. ఇందుకోసం ఓ ఇండిపెండెంట్ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎవాల్యుయేషన్ అథారిటీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఓ కొత్త సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం రూపకల్పన చేయనుంది. పథకాలన్నింటిని ఈ సంస్థ మానీటర్ చేయనుంది. పథకాల్లో ఉన్న లోటు పాట్లను ఎత్తి చూపడంతో పాటు లక్ష్యసాధనలో ఎంత వరకు విజయం సాధించాయన్న వాటిని పరిశీలించనుంది. పథకాల పనితీరును మెరుగు పర్చేందుకు అవసరమైన సలహాలు సూచనలు చేయనుంది.
పథకాల తీరుతెన్నులు.. అమలు కూడా ప్రస్తుతం సంబంధిత శాఖలే నిర్వహిస్తున్నాయి. అమలు చేసే వాళ్లు, పరిశీలించే వాళ్లు కూడా సంబంధిత శాఖ అధికారులు కావడంతో పథకాల మదింపు నామ మాత్రంగానే జరుగుతుంది. ప్రభుత్వ శాఖలే మదింపు చేస్తుండంతో రాజకీయ ఒత్తిళ్లు కూడా అధికంగానే ఉంటాయి. దీంతో అక్రమాలు వెలుగు చూడటం లేదు. అదే మదింపు పనిని స్వతంత్ర సంస్థకు కట్టబెడితే మంచి ఫలితాలు వస్తాయని సర్కార్ భావిస్తుంది.
కర్ణాటకలో ఇలాంటి స్వతంత్ర సంస్థనే పథకాల అమలును పర్యవేక్షిస్తుంది. కర్నాటకలో మంచి ఫలితాలు వస్తుండటంతో, ఇక్కడ కూడా అలాంటి స్వతంత్ర్య సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్లానింగ్ శాఖ ఈస్ట్ విధివిధాలను రూపొందించింది. ఫైలును సీయం కేసీయార్ ఆమోదం కోసం పంపింది. చైనా పర్యటన నుంచి రాగానే ముఖ్యమంత్రి ఫైల్ కు ఆమోదముద్ర వేయనున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారి ఈ సంస్థకు నేతృత్వం వహించనున్నారు. ప్రొఫెసర్లు, మేధావులతో పాటు ప్రభుత్వ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో కూడా ఈ సంస్థ తన కార్యకలపాలు కొనసాగించనుంది. ఈస్ట్ నిర్వహణ ఖర్చు కోసం ఇప్పటికే 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సంక్షేమంపై ఖర్చు చేసే ప్రతిపైసా అర్హులకే చేరేలా ప్రభుత్వం చేస్తోన్న సరికొత్త ప్రయోగం మంచి ఫలితాలు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.




