Tuesday, 3 November 2026

పది జిల్లాల తెలంగాణ కావాలి : గద్దర్‌


దీక్ష విరమించిన బైరెడ్డి
త్వరలో కొత్త పార్టీ
హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) :
పది జిల్లాల తెలంగాణ రాష్ట్రమే కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నుంచి బయట పడేసేందుకు మార్గాలు వెతక్కుండా మరిన్ని సమస్యలను సృష్టించడం కేంద్రానికి సరైంది కాదని అన్నారు. రాయలసీమను విడదీయరాదంటూ 52 గంటల దీక్ష చేపట్టిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని శనివారం గద్దర్‌ కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా గద్దర్‌ మాట్లాడుతూ పది జిల్లాలు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా తామంతా ఉద్యమాలు చేస్తున్నామన్నారు. రాయల తెలంగాణ అంటూ కొత్త పల్లవిని ఎంచుకోవడం వెనుక ఎన్నికలలో లబ్ది పొందాలనే లక్ష్యం దాగి ఉందన్నారు. ఎంతో చరిత్రను కలిగిన రాయలసీమను ముక్కలు చేయడం సరైంది కానే కాదన్నారు. రాయల తెలంగాణకు తెలంగాణలోని ఏఒక్కరు కూడా అంగీకరించడం లేదన్నారు. బైరెడ్డి ఆందోళనకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తలకొరివితో నరుక్కోవాలని చూస్తే ఎవరేం చేయలేరని, తెలంగాణా రాష్టాన్న్రి ఏర్పాటు చేసి సీమాంధ్ర అభివృద్దికి సంపూర్ణ సహకారం అందించాలని గద్దర్‌ డిమాండ్‌ చేశారు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో బడా బడా నేతలుగా మెలుగుతున్న ముగ్గురు దద్దమ్మలు రాయలసీమవారే కావడం తమ దౌర్బాగ్యమని అన్నారు. సిఎం, మాజీ సిఎం, వైసిపి నేతలపై నిప్పులు చెరిగారు. చీము, నెత్తురు చచ్చిన నేతలుగా ఉన్నారని, ఆత్మగౌరవానికే భంగం కలుగుతుంటే కనీసం నోరు విప్పడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణపై నిర్ణయం వెలువడుతున్న సమయంలో రాయలసీమను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నా ఈదద్దమ్మలైన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సిఎం చంద్రబాబునాయుడు. రెండు పడవల్లో ప్రయాణిస్తాననుకుంటున్న విజయమ్మలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన నిలదీశారు. రాబోయే రోజుల్లో రాయలసీమ మ్యాపే చిత్రంలో ఉండదన్నారు. తమవద్ద ఉద్యోగాలు లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, కాని ఆత్మగౌరవం మాత్రం ఇంకా బ్రతికే ఉందన్నారు. రాయలసీమ నేడు రాళ్లసీమగా మారినా కూడా పట్టించుకున్న పాపాన పోని నేతలు విచ్చిన్నం చేస్తుంటే కూడా చూస్తూ కూర్చుంటున్నారని ఆరోపించారు. రాయల తెలంగాణా  ఏర్పడితే రెండు ప్రాంతాల్లో తాము ముఖ్యమంత్రులం అవుతామని విజయమ్మ పగటి కలలు కంటుందన్నారు.  సింహగర్జన లంటూ చంద్రబాబు గాలిలో తిరుగుతున్నాడని, కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారం మత్తులో ఊగి తూలుతున్నాడని తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు. పాలకులుగా ఉండి కూడా రాయలసీమకు పట్టెడన్నం పెట్టని నేతలే ఈముగ్గురు దద్దమ్మలన్నారు. రాయలసీమలో పొలాలన్నీ భీళ్లుగా మారిపోయాయని, రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక బెంగళూర్‌, విజయవాడ, హైదరాబాద్‌లకు తట్ట,పార పట్టుకుని పొట్ట చేతపట్టుకుని వచ్చి కూలీలుగా మారిన వారు లక్షల్లో ఉన్నారన్నారు. వారి ఆత్మఘోష కూడా ఈబడా నేతలకు పట్టక పోవడం దారుణంగా ఉందన్నారు. రాయలసీమను ముక్కలు చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే అడ్డుకుని తీరుతామని కాంగ్రెస్‌ను హెచ్చరించారు. సోనియాగాంధీ, తెలంగాణా అంతా కలిసి గంగలో దూకండంటూ శాపనార్థాలు పెట్టారు. తమ రాయలసీమను విడగొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. కేంద్రానికి, సోనియాకు రాయలసీమను విడగొట్టే అధికారం ఎవరిచ్చారని బైరెడ్డి నిలదీశారు. నేతల్లాగా ప్రజలు మాత్రం దున్నపోతు నిద్రలో పోవద్దన్నారు. పుట్టిన గడ్డపైన ఆత్మాభిమానం చాటి చెప్పాలని, రాబోయే రోజుల్లో రాయలతెలంగాణా వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే రాయలసీమ కాలగర్భంలో కలిసి పోతుందన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజధానినే వదులుకున్నామన్నారు. మౌలాలి అనే వలస కూలీగా మారిన రాయలసీమ రైతుచేత నిమ్మరసం తీసుకున్న భైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దీక్షను విరమించారు. తన ఉద్యమ కార్యాచరణను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తానన్నారు. ఇంతటితో ఉద్యమం అయిపోయిందనుకుంటే పొరపాటేనన్నారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనన్నారు. రాయలసీమను ముక్కలు చేయకుండా ప్రకటన వచ్చే వరకు కూడా పోరాటం ఆగదన్నారు. వీలైతే రాష్ట్రం ఇవ్వండి లేదా మమ్మల్ని విగొట్టొద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *