పవన్.. నీఅన్న మంత్రి ఎలా అయ్యారు?
– లోకేష్‌పై పవన్ వ్యాఖ్యలు అర్థరహితం
– కన్నా అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతాం
– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
అమరావతి, జులై10(జనం సాక్షి) : తన సోదరుడు చిరంజీవి రాజ్యసభ ద్వారానే మంత్రి అయిన విషయాన్ని పవన్‌కల్యాణ్ మరచిపోకూడదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ చంద్రబాబుపై ముప్పేట దాడి జరుగుతోందన్నారు. మంత్రి లోకేష్‌పై పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. బీజేపీ రాసిచ్చిన స్కిప్ట్ చదివే ముందు పవన్ ఆలోచించుకోవాలని సూచించారు. ఇక.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపడుతున్న ర్యాలీల్లో సంఘ విద్రోహ శక్తులు పాల్గొంటున్నాయని ఆరోపించారు. ప్రత్యేక ¬దాపై ప్రశ్నించిన వారిపై ఈ సంఘ విద్రోహ శక్తులు దాడులు చేస్తున్నాయని విమర్శించారు. అవినీతి గురించి కన్నా మాట్లాడం విడ్డురంగా ఉందని అన్నారు. చంద్రబాబుపై కన్నా పరిమితులు దాటి మాట్లాడుతున్నారని, బాబుపై చేస్తున్న ఆరోపణలను నిరూపించగలరా అని ప్రశ్నించారు. కన్నా అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం సహకారం ఉంటేబాగుంటుందని భావించి చంద్రబాబు ఎన్డీయేలో చేరారని అన్నారు. కానీ ప్రధానినరేంద్రమోడీ ఏపీని మోసం చేశారని అన్నారు. అయినా చంద్రబాబు మొక్కవోని దీక్షతో 60ఏళ్ల వయస్సులో అహర్నిశలు కష్టపడుతూ ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని బుద్దా వెంకన్న
పేర్కొన్నారు. కానీ ప్రతిపక్ష నేతజగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఏపీ ప్రజల బాగోగులను విస్మరించిన బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని, తద్వారా చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబుపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్‌లతో పాటు బీజేపీ భరతం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.