– గవర్నర్ నరసింహన్
– ఆన్‌లైన్ ఓటింగ్‌పై చర్చ జరగాలి
– మంత్రి కేటీఆర్
– 18వ జాతీయ పీఎస్సీ చైర్మన్ల సదస్సు ప్రారంభం
హైదరాబాద్,ఫిబ్రవరి 4(జనంసాక్షి):నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ 18వ జాతీయ సదస్సు జరిగింది. ప్రగతిరిసార్ట్స్‌లో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న నరసింహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాట్లాడుతూ ఉద్యోగాల కల్పన తో తెలంగాణను నంబర్ 1రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ సదస్సుకు గవర్నర్ నరసింహన్‌తోపాటు మంత్రి కేటీఆర్ ,యూపీఎస్సీ ఛైర్మన్ దీపక్‌గుప్తా,29 రా ష్టాల పీఎస్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఆన్‌లైన ఓటింగ్‌పై నిర్ణయం తీసుకోవాలి:మంత్రి కెటిఆర్
భాగ్యనగరం మరో జాతీయ సదస్సుకు వేదికైంది. నగరంలోని ప్రగతి రిసార్ట్స్‌లో పీఎస్సీ ఛైర్మన్ల 18వ జాతీయ సదస్సు షురూ అయింది. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జ్యోతి ప్రజల్వన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు దేశంలోని 29 పీఎస్సీ ఛైర్మన్లు హాజరయ్యారు. రెండు రోజులపాటు సదస్సు కొనసాగనుంది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఆన్‌లైన్ ఓటింగ్ విూద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సును హైదరాబాద్ శివారులోని ప్రగతి రిసార్ట్సులో కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఓటింగ్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సమావేశాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించాల్సి ఉంది. ఆన్‌లైన్ ఓటింగ్‌పై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పోలింగ్ తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించే అంశంపై ఆలోచించాలన్నారు. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం 45శాతం పోలింగ్ మాత్రమే నమోదైన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆన్‌లైన్ ఓటింగ్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హైదరాబాద్‌లో పీఎస్సీ ఛైర్మన్ల సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తోందని తెలిపారు. గతంలో విద్యా, ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యోగాల కోసం పోరాటాలు చేశారని గుర్తు చేశారు. టీఎస్‌పీఎస్సీ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని నియామకాలు చేపడుతోందని తెలిపారు. నూతన సంస్కరణలు తీసుకొచ్చి నోటిఫికేషన్‌ల వివరాలు, ఎస్‌ఎంఎస్ అలర్డ్, వన్ టైం రిజిస్టేష్రన్ వంటి అనేక సదుపాయాలను కల్పిస్తోందని వివరించారు. దేశంలోని అతిపెద్ద స్టార్టప్ కోసం టీహబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఐడియాతో రండి.. ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచనతో వెళ్లండి అనే నినాదంతో దీనిని ప్రారంభించామని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి,యూపిపిఎస్సీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సు నిర్వహించడంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో అన్ని సర్వీసు కమిషన్లకు కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సదస్సు హైదరాబాద్‌లో తొలిసారి నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని చక్రపాణి చెప్పారు.





