పార్టీమారే ఆలోచనకు దూరంగా ఆనం

నెల్లూరు,మే12(జ‌నం సాక్షి): నెల్లూరు జిల్లా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే సోదరుడు వివేకా మృతితో కొంత డిప్రెషన్‌లో ఉన్న ఆనం తాజా రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ.. వైసీపీకి దగ్గరవుతున్నారా అన్న అనుమానాన్ని ప్రజల్లో కలిగించిన ఆనం రామనారాయణ రెడ్డి ఎట్టకేలకు టీడీపీలోనే ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైకాపాలో చేరుతారంటూ ప్రచారం జరిగినా ఇది సమయం కాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా ఆ మధ్య ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరనున్నట్లు విపరీతంగా ప్రచారం సాగింది. అయితే వారి ఆశలను నీరుగారుస్తూ… ఆయన టీడీపీలోనే ఉండాలని తీర్మానించుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన వైసీపీలో తప్పక చేరుతారని, 2019 ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం విషయంలోనే వైసీపీతో ప్రతిష్టంభన నెలకొందని, అది మినహా వైసీపీలో చేరడం ఖాయమైందని ప్రచారం జరిగింది. అయితే వివేకా మరణంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దీంతో ఇక మార్పు రాజకీయాలను ఆయన దూరంగా పెట్టారని అంటున్నారు.

తాజావార్తలు