
వలసలను నిర్మూలిస్తాం: కెసిఆర్
హైదరాబాద్,మార్చి31(జనంసాక్షి): తెలంగాణ జల విధానంతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. జిల్లా నుంచి వలసలను నివారించడానికి ప్రాజెక్టుల నిర్మాణం ఒక్కటే పరిష్కారమని సిఎం కెసిఆర్ అన్నారు. అసెంబ్లీలో జల విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పాలమూరును పచ్చగా చూసే రోజులు దగ్గర్లో ఉన్నాయని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయని ఆ జిల్లా నేతనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సరికాదు, అయినప్పటికీ ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొదటి ప్రాజెక్టు నార్లపూర్ ప్రాజెక్టు అని తెలిపారు. వట్టెం, కరివెన, ఉద్ధండపూర్ రిజర్వాయర్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావొచ్చంది, కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతిపాదిత ఆయకట్టు కంటే నెట్టెంపాడు ద్వారా 25 వేల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. నెట్టెంపాడు ద్వారా గట్టు మండలానికి నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. భీమా ప్రాజెక్టు వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందన్నారు. ఆర్డీఎస్ దిగువ భాగంలో రీడిజైన్ చేస్తున్నామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా 8 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. పాలమూరు ద్వారా దక్షిణ తెలంగాణకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తామని ఉద్ఘాటించారు. సమైక్య పాలకులు ప్రారంభించిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఎన్నటికీ కూడా పూర్తయ్యే పరిస్థితిలేదని సీఎం అన్నారు. టన్నెల్ సొరంగం ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, మిషన్లు భూమిని లోపలి నుంచి తవ్వుకుంటూ సొరంగం ఏర్పాటు చేస్తాయని వివరించారు. అటు నుంచి ఒక మిషన్ ఇటు నుంచి ఒక మిషన్ సొరంగం చేసూకుంటూ పోతాయని రెండు మిషన్లు కలిశాక మిషన్లను లోపలే డెడ్ చేసి అలాగే వదిలేస్తారని తెలిపారు. ఇప్పుడు కూడా తాను ఇంజినీర్లను అడిగినా ఇంకా రెంండు మూడేండ్లలో పూర్తవుతుందని అంటున్నారని వివరించారు. టైగర్ వ్యాలీ ప్రాజెక్టు కూడా ప్రాజెక్టుకు అంతరాయంగా ఉందని తెలిపారు. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఎన్నాళ్ల నుంచో జరుగుతుందన్నారు. ఇది ఎవరి పాపమని ప్రశ్నించారు. సమైక్య పాలకులు చేసిన అన్యాయం కాదా? అని నిలదీశారు. ఇది ఎప్పటికి పూర్తయ్యేది అని అడిగారు. అయినా ప్రాజెక్టు పనులను కొనసాగిండం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. మిషన్లు భూమిలో తవ్వుకుంటూ పోతున్నాయని వివరించారు.




