Tuesday, 3 November 2026

మా వాటా మాకు ఇప్పించండి

Untitled-5

ఎపి సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు

కరెంటు కష్టాలకు బాబే కారణం : టిఎస్‌ ప్రభుత్వం

న్యూఢిల్లీ, నవంబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఎపి ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ను తమ వాటాను తమకు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి విద్యుత్‌ వాటా వచ్చేలా చూడడంతో పాటు అదనపు విద్యుత్‌ కేటాయించాలని విన్నవించింది. తెలంగాణ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, విద్యుత్‌ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. టీఆర్‌ఎస్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధులు రామచంద్రుడు తదితరులు మంగళవారం కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శిని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ వైఖరిపై ఫిర్యాదు చేసింది. విద్యుత్‌ కొరత వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రా నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా వచ్చేలా చూడాలని, అలాగే అదనపు విద్యుత్‌ కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర విద్యుత్‌ కార్యదర్శితో భేటీ ముగిసిన అనంతరం ఎంపీ వినోద్‌ విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ఉల్లంఘనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన 53.84 శాతం మేర విద్యుత్‌ ఇవ్వకుండా ఏపీ సర్కారు ఇబ్బంది పెడుతోందన్నారు. ఏపీ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శిని కోరామని వివరించారు. అదనపు విద్యుత్‌ కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా తెలంగాణలో విద్యుత్‌ కొరత ఏర్పడుతోందన్నారు. రబీ, ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను కాపాడే బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. దిగువ సీలేరు, కృష్ణపట్నం, అనంతపురంలోని గ్రిడ్‌ పవర్‌ నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాను తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ఉల్లంఘనలపై ఏర్పాటు చేసిన నీరజామాథుర్‌ నివేదిక కూడా ఆలస్యమవుతోందని, దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో విద్యుత్‌ సమస్యలు ఏర్పడ్డాయని విమర్శించారు. గత పాలకులు తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని, ఇక్కడ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విముఖత చూపారని ఆరోపించారు. తెలంగాణలో దండిగా బొగ్గు గనులు ఉంటే.. పిడికెడు బొగ్గు కూడా దొరకని సీమాంధ్రలో విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారని విమర్శించారు. గత పాలకుల పాపాలను కడిగేసేందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నాలుగు మాసాల్లోనే అదనపు విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు తీసుకున్నామని వివరించారు. బీహెచ్‌ఈఎల్‌ ద్వారా తెలంగాణ జెన్‌కో 6 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. అలాగే, ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, త్వరలోనే సరఫరా ప్రారంభమవుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *